ఆ ఆలయంలో మెట్లకి.. యమ ధర్మరాజుకి సంబంధం ఏమిటి ?

మన భారతదేశంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు నెలకొని ఉన్నాయి.

Update: 2024-02-29 09:15 GMT

దిశ, ఫీచర్స్ : మన భారతదేశంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు నెలకొని ఉన్నాయి. అలాగే ఆ ఆలయాల్లో అంతుచిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి ఒక ఆలయమే పూరీ జగన్నాథ స్వామి ఆలయం. ఈ జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని తీరప్రాంత నగరమైన పూరిలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు, సుభద్రాదేవి, బలరాముడు దర్శనం ఇస్తారు. శ్రీకృష్ణుని ఈ నగరాన్ని జగన్నాథపురి అంటారు. ఈ ఆలయం బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, జగన్నాథపురి అనే హిందువుల నాలుగు పవిత్ర స్థలాలలో ఒకటి. ఈ ఆలయం అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. నేటికీ ఈ ఆలయంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. ఈ రహస్యాలను ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అలాంటి ఒక రహస్యం ఈ ఆలయ మెట్లు. మరి ఇంతకీ మెట్ల రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జగన్నాథపురి మెట్లు..

పురాణాల ప్రకారం జగన్నాథుడు భూమి పై స్వర్గం అంటే వైకుంఠ ధామం. జగన్నాథ ఆలయంలో విష్ణువు అవతారమైన కృష్ణుడు, ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర దర్శనం ఇస్తారు. ఇక్కడి జగన్నాథుని దర్శించి ఏదైనా కోరిక కోరితే తీరుతాయని, సర్వపాపాలు హరిస్తాయని భక్తులు, పండితులు చెబుతుంటారు. అయితే ఈ ఆలయంలో నెలకొని ఉన్న మెట్లలో మూడవ మెట్టులో ఓ రహస్యం దాగి ఉంది.

పురాణాల ప్రకారం జగన్నాథుడిని దర్శించుకున్న తర్వాత ప్రజలు పాపాల నుంచి విముక్తి పొందడం ప్రారంభించారని చెబుతారు. అప్పుడు యమధర్మరాజు అది చూసి జగన్నాథుని దగ్గరకు వెళ్లి, “ఓ ప్రభూ ప్రజలు పాపం నుండి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు. నిన్ను దర్శించడం ద్వారా ప్రజలు తమ పాపాల నుండి సులభంగా విముక్తులవుతున్నారు. దీంతో ఎవరూ నరకానికి రారు అన్నాడట. యమధర్మరాజు మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మూడవ మెట్టు నీది. దీనిని యమ్ శిల అని పిలుస్తారు. ఎవరైతే నన్ను చూసి దాని మీద కాలు పెడితే అతని పుణ్యాలన్నీ కొట్టుకుపోయి యమలోకంలోకి వెళ్ళవలసి వస్తుంది అని జగన్నాథుడు తెలిపాడట.

మూడవ మెట్టు పై అడుగు పెట్టడం నిషేధం..

జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుండి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు, దిగువ నుండి మూడవ మెట్టు పై యమశిల ఉంటుంది. భక్తులు స్వామి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు, దర్శనం అయ్యాక వచ్చేటప్పుడు మూడవ మెట్టుపై అడుగు పెట్టకుండా ఉండటం మంచిది. ఈ యమశిల మెట్టు నలుపు రంగులో, ఇతర మెట్ల కంటే భిన్నమైన రంగులో ఉంటుంది. జగన్నాథపురి ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత దిగువ నుండి ప్రారంభించి మూడవ మెట్టు పై కాలు పడకుండా బయటికి రావాలి. లేకపోతే చేసుకున్న పుణ్యాలన్నీ శూన్యం అవుతాయని చెబుతున్నారు పండితులు.

Tags:    

Similar News