‘డెల్టా ప్లస్’ ప్రమాదకారి అని చెప్పలేం.. హైకోర్టుకు హెల్త్ డైరెక్టర్ నివేదిక

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం దేశంలో ఉన్న ‘డెల్టా‘ వేరియంట్ కంటే ‘డెల్టా ప్లస్‘ వేరియంట్ ప్రమాదకరమని చెప్పలేమని, ఇందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు కూడా ఏవీ లేవని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో ‘డెల్టా ప్లస్’ వేరియంట్ కేసులు నమోదు కాలేదని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదైనందు వల్ల తెలంగాణలో అది వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని, అప్రమత్తంగా ఉన్నామని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో […]

Update: 2021-07-07 11:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం దేశంలో ఉన్న ‘డెల్టా‘ వేరియంట్ కంటే ‘డెల్టా ప్లస్‘ వేరియంట్ ప్రమాదకరమని చెప్పలేమని, ఇందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు కూడా ఏవీ లేవని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో ‘డెల్టా ప్లస్’ వేరియంట్ కేసులు నమోదు కాలేదని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదైనందు వల్ల తెలంగాణలో అది వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని, అప్రమత్తంగా ఉన్నామని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

థర్డ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కోడానికి ముందస్తు చర్యలు చేపట్టినట్లుగానే డెల్టా ప్లస్ వేరియంట్‌ విషయంలో కూడా సంసిద్ధంగా ఉన్నామని వివరించారు. కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం జరిపిన విచారణ సందర్భంగా నివేదిక ద్వారా పై అంశాలను వివరించారు. ప్రజారోగ్య శాఖ తరహాలోనే విద్యాశాఖ, పోలీసు శాఖ, జైళ్ళ శాఖ, శిశు సంక్షేమ శాఖలు కూడా హైకోర్టుకు నివేదికలను సమర్పించాయి. ఇక థర్డ్ వేవ్ గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తరఫున తీసుకుంటున్న చర్యలను ఆ నివేదికలో డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు.

రానున్న నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం బెడ్‌లకు ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించనున్నామని తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు 1.14 కోట్ల డోసులను పంపిణీ చేశామని, ఇందులో 81.42 లక్షల మందికి మొదటి డోసు ఇవ్వగా మిగిలిన 16.39 లక్షల మందికి సెకండ్ డోస్ ఇచ్చినట్లు తెలిపారు.

ఇంకా 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో 1.40 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలపై జీవో కూడా ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ప్రైవేట్ వైద్య కేంద్రాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 231 ప్రైవేటు ఆస్పత్రులపై 594 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 38 ఫిర్యాదుల్లో బాధితులకు రూ. 82.64 లక్షలను వెనక్కి ఇప్పించినట్లు ఆ నివేదికలో డైరెక్టర్ వెల్లడించారు.

Tags:    

Similar News