TG Govt.: అన్నదాతలకు తీపి కబురు.. అందుబాటులోకి రానున్న భూభారతి పోర్టల్!

రాష్ట్రంలో మరో పది రోజుల్లోపు ధరణి పోర్టల్ పీడ విరగడ కానున్నది.

Update: 2025-03-22 02:04 GMT
TG Govt.: అన్నదాతలకు తీపి కబురు.. అందుబాటులోకి రానున్న భూభారతి పోర్టల్!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో పది రోజుల్లోపు ధరణి పోర్టల్ పీడ విరగడ కానున్నది. లక్షలాది మంది రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న విధానానికి స్వస్తి పలకనున్నారు. దాని స్థానంలో ప్రజాభిప్రాయాలతో రూపొందించిన భూ భారతి చట్టాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ స్థానంలో www.BhuBharathi.telangana.gov.in భూ భారతి వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ పోర్టల్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌​రెడ్డి డొమెయిన్‌కు క్లియరెన్స్ ఇచ్చినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం పొందగానే అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పటికే భూ భారతి ఆర్వోఆర్ చట్టం-2025 మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ఆమోదించింది. న్యాయశాఖ పరిశీలన కొనసాగుతున్నది. నేడో రేపో సీఎం ఆఫీసుకు చేరనున్నదని విశ్వసనీయ సమాచారం.

పొరపాట్లు రిపీట్ కాకుండా చర్యలు

గతంలో ధరణి పోర్టల్ అమల్లోకి తీసుకొచ్చినప్పుడు చోటు చేసుకున్న పొరపాట్లు మరోసారి రిపీట్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు.. కానీ రైతులు, హక్కుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే సీఎం ఆదేశాలు పాటిస్తున్నారు. పౌర సేవల్లో అంతరాయం కలగొద్దని, భూమి హక్కుల డేటాలోనూ ఎలాంటి తప్పులు దొర్లకుండా చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు ఓ ఐఏఎస్ అధికారి తెలిపారు. పట్టాదారులెవరూ భయానికి లోనయ్యే సమస్యలను సృష్టించకుండా కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఆర్కిటెక్చర్ మూలాలు మార్చకుండా..

ఓ డొక్కు స్కూటర్.. అది కొంత కాలం నడుస్తుంది. అయితే, దానిని నడపడం కొందరికే సాధ్యం. గమ్యం వరకు వెళ్లాలంటే కష్టం. అందుకే ఆ స్కూటర్ నడవదనుకున్నప్పుడు దాన్ని స్క్రాప్ కింద అమ్మేయాలి. ఆ తర్వాత కొత్త బైక్ కొనుక్కోవాలి. ధరణి పోర్టల్ కూడా అంతే. అందులోని మూలాలను మార్చకుండా మిగతా అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే. అది స్పీడ్‌గా సిటిజన్ సర్వీసెస్‌ను అందించలేకపోతున్నది. అందుకే ఆ స్పీడ్ లిమిట్‌ను పెంచుకుంటూనే కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఓ అధికారి వెల్లడించారు. స్పీడ్ లిమిట్‌ను క్రాస్ చేస్తే సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆర్కిటెక్చర్ మూలాలను మార్చకుండా మెరుగైన సేవలను అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికీ ఎన్ఐసీని భయపెడుతున్న ‘ధరణి’!

ధరణి పోర్టల్ మొదలుపెట్టినప్పుడు ఐదారు ఉంటే.. వాటిని ఒక్కొక్కటిగా పెంచుతూ 35 మాడ్యూళ్లు చేశారు. అందుకే అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఇప్పుడా సమస్య తలెత్తకుండా డొమెయిన్ స్టెబిలిటీని పరిశీలించుకుంటూ అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇప్పటికీ ధరణి పోర్టల్ ఎన్ఐసీ టెక్నికల్ టీమ్‌ను భయపెడుతుందని తెలిసింది. ఏది ముట్టుకుంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని సమాచారం. అందుకే ఈ మధ్య ఏ మార్పు చేయాలని ప్రయత్నించినా డొమెయిన్ రన్నింగ్ స్లో అవుతుంది. దాంతో స్లాట్ బుకింగ్ కాకపోవడం, స్లాట్స్ ఉన్నా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నెమ్మదించడం, ఫైళ్లు అప్‌లోడ్ కాకపోవడం వంటి అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు అంటున్నారు.

ఒక్కొక్కటిగా అమల్లోకి..

భూ భారతి చట్టాన్ని ఒకేసారి అమలు చేసే సాంకేతిక దన్ను ఉంది. కానీ ఆర్కిటెక్చర్‌ను మార్చకుండా తీసుకొస్తున్న భూ భారతి పోర్టల్ స్టెబిలిటీని పరిశీలించుకుంటూ ఒక్కొక్క దాన్ని అమల్లోకి తీసుకొస్తామని సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరంద్ తెలిపారు. అయితే, అది కూడా 10 నుంచి 12 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన మెకానిజంను సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. భూ భారతి రూల్స్ ఆమోదించగానే, వాటికి తగ్గట్లుగా పోర్టల్ డిజైన్ ఉంటుంది. ఉదాహరణకు టీఎం 33‌లో పట్టాదారుడి పేరులో కరెక్షన్ చేసే అధికారం ఎవరికి ఇస్తారనే దానిపై డిజైనింగ్ ఉంటుంది. ఇప్పుడేమో అన్నింటినీ సీసీఎల్ఏకే కోడ్ చేశారు. ఆ తర్వాత కలెక్టర్లు, ఆర్డీవోలకు మార్చారు. ఇలా మార్చిన ప్రతిసారీ అనేక టేబుల్స్ వచ్చాయి. వీటితో పోర్టల్ స్లో అవుతుంది. అందుకే ఇప్పుడా చికాకులు తలెత్తకుండా నిబంధనలకు అనుగుణంగానే కోడింగ్ చేయాలని నిర్ణయించారు. మళ్లీ మళ్లీ మార్చడం ద్వారా ఉత్పన్నమయ్యే టెక్నికల్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

అన్నింటికీ ‘భూ భారతి’..

ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతిపై ప్రజల అంచనాలు పెరిగాయి. అద్భుతాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రజల అంచనాలను ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు గుర్తించారు. అదే స్థాయిలో ఎన్ఐసీతో పని చేయించడానికి వ్యూహరచన చేశారు. సాఫ్ట్‌వేర్ నుంచి తప్పులు దొర్లకుండా టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించేటప్పుడు అంచనా వేసిన ఇష్యూస్ అనుభవంలో ఉన్నాయి. అందుకే భూ భారతి చట్టం గైడ్‌లైన్స్‌కు అనుకూలంగానే, నోటిఫై చేయగానే.. డొమెయిన్ సిద్ధమవుతుంది. అయితే, ధరణి పోర్టల్ కంటే స్పీడ్‌ను కచ్చితంగా పెంచనున్నారు. కానీ క్రమేణా అన్ని అంశాలను అమల్లోకి తీసుకురావడం మాత్రం సస్టెయినబిలిటీని పరిశీలించుకుంటూనే ముందుకు తీసుకెళ్తారని తెలిసింది. మరో పది రోజుల్లో రానున్న భూ భారతి పోర్టల్‌పై అటు అధికారులు, ఇటు ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొన్నది.

Tags:    

Similar News