పార్టీ పటిష్ఠతకు టీ.కాంగ్రెస్ భారీ ప్లాన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయబోతున్నారో తెలుసా?

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అఖిల భారత కాంగ్రెస్‌ ​దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

Update: 2025-03-24 03:06 GMT
పార్టీ పటిష్ఠతకు టీ.కాంగ్రెస్ భారీ ప్లాన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయబోతున్నారో తెలుసా?
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అఖిల భారత కాంగ్రెస్‌ ​దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందుకోసం గ్రామగ్రామాన పార్టీ పటిష్ఠతకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు.

గ్రామాలకు మోడల్ కిట్​లు..

టీపీసీసీ ఆఫీసు నుంచి ప్రతి మండలానికి మోడల్ కిట్ అందజేశారు. ఇందులో కాంగ్రెస్ జెండా-ఖాదీ, భారత రాజ్యాంగ కాపీ, మహాత్మా గాంధీ ఫొటో, బీఆర్ అంబేడ్కర్ ఫోటో, అభియాన్ గురించి సాహిత్యం, అదనంగా కరపత్రాలు- రాజ్యాంగ, రాజకీయ, కాంగ్రెస్ పథకాల వివరాలు అందజేశారు. పాదయాత్రలో భాగంగా ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లిన వేళ గ్రామ అధ్యక్షుడికి ఇవి అప్పగించాలి. మండలంలోని అన్ని గ్రామాలలో ఈ పాదయాత్ర పూర్తయ్యే వరకు దీనినే కొనసాగించాలి. ముఖ్యంగా ఉదయం రెండు గ్రామాలు, సాయంత్రం రెండు గ్రామాలలో పాదయాత్ర చేపట్టాలి. అన్ని గ్రామాల ముగింపులో మండల ప్రధాన కార్యాలయం, మండలంలోని ఒక ప్రధాన గ్రామంలో మండల ముగింపు సమావేశాన్ని ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించారు.

ముగిసిన రాష్ట్రస్థాయి సన్నాహక మీటింగ్

ఫేజ్​–1లో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం గాంధీ భవన్‌​లో ఇటీవల మార్చి19వ తేదీన జరిగింది. దీనికి కింది ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో రాష్ట్ర సమన్వయ కమిటీ, డీసీసీ అధ్యక్షులు, నియామక రాష్ట్ర సమన్వయకర్తలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధిపతులు, ఇండియాన్ యాత్‌ ​కాంగ్రెస్, ఎన్​ఎస్‌యూఐ, మహిళా, సేవాదళ్​ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు హాజరయ్యారు. వీరికి జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

జిల్లా స్థాయి సన్నాహక సమావేశం..

పార్టీ ఆదేశాల మేరకు పీసీసీ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సన్నాహక సమావేశం సైతం నిర్వహించాలి. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు అధ్యక్షత వహించాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర సమన్వయకర్తలు, రాష్ట్ర పీసీసీ ఆఫీస్ బేరర్లు, ఫ్రంట్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ హెడ్‌లు, బ్లాక్, మండల అధ్యక్షులు, నగర, పట్టణ, డివిజన్ అధ్యక్షులు, డీసీసీ ఆదేశాల ప్రకారం ముఖ్య సీనియర్ నాయకులు కూడా పాల్గొనాలి. అదనంగా, మండల సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలి. మార్చి 24వ తేదీన అమలు చేసి పూర్తి చేసేలా చూసుకోవాల్సి ఉంటుంది.

28 లోపు మండల సమావేశాలు పూర్తి కావాలి

మండల స్థాయిలో సన్నాహక సమావేశానికి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధ్యక్షత వహించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన ఎమ్మెల్యేల అభ్యర్థులు, రాష్ట్ర సమన్వయకర్తలు, మండల స్థాయి ఫ్రంట్ ఆర్గనైజేషన్, విభాగాధిపతులు, బ్లాక్, గ్రామ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, బూత్ ఇన్‌చార్జీలు, ఏజెంట్‌లు, ఇతర ముఖ్యమైన నాయకులు పాల్గొనేలా చూసుకోవాలి. అదనంగా, పాదయాత్ర తేదీలను ఖరారు చేసుకోవాలి. గ్రామాలు, రూట్ ప్లాన్ జాబితా తయారు చేసుకోవాలి. కార్యక్రమం ప్రారంభ, ముగింపు తేదీ నిర్ణయించుకోవాలి. ఇది ఏ గ్రామంలో ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగిసేదానిపై ప్లాన్​‌ చేసుకోవాలి. దీనిని మార్చి 28వ తేదీలోపు అమలు చేసి పూర్తి చేసేలా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సమావేశంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సందేశాన్ని, ప్రతిజ్ఞను వినిపించాలి. అలాగే రిపోర్టులు ఇచ్చేలా చూసుకోవాలి.

ఏడాది పాటు అభియాన్ కార్యక్రమాలు

మహాత్మా గాంధీ వారసత్వాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం, రక్షించడం, ప్రోత్సహించడం అనే ఆవశ్యకత దృష్ట్యా ఈ ఉద్యమం కొనసానుంది. ఈ ఏడాది జనవరి 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 మధ్య సీడబ్ల్యూసీ సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రజా ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పాదయాత్రలో నాయకులు గ్రామం నుంచి గ్రామానికి, పట్టణానికి రిలే ఫార్మాట్‌లో పాదయాత్ర చేయనున్నారు. సంవత్సరం పాటు ఈ అభియాన్ కార్యకలాపాలు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు ఇన్‌చార్జీలను నియమించారు.

రాజ్యాంగ ప్రాముఖ్యతపై యాత్రలో వివరణ

భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇది దాని ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. భారత రాజ్యాంగం అధికారికంగా నవంబర్ 26, 1949న ఆమోదించారు. జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. ఈ 75 ఏళ్ల ప్రాముఖ్యతను పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు వివరించనున్నారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని రంగారెడ్డి, సంగారెడ్డి, యాద్రాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికే నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్స్‌లో పీసీసీ చీఫ్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, ముఖ్య లీడర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News