అది కాదు.. వాస్తవ పరిస్థితి ఇదీ..!
దిశ, నిజామాబాద్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఒకవైపు పదే పదే చెబున్నా వాస్తవానికి మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చిన ధాన్యాన్ని పది, ఇరవై రోజులు దాటితే గానీ కొనుగోళ్లు చేపట్టడంలేదు. ఈలోపు అకాల వర్షాలు కురవడంతో మళ్లీ ధాన్యాన్ని రైతులు ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోన్నది. గత రెండు వారాల నుంచి ఈదురుగాలులు, అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పగలు, ఎండ తీవ్రతతో కొనుగోలు […]
దిశ, నిజామాబాద్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఒకవైపు పదే పదే చెబున్నా వాస్తవానికి మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చిన ధాన్యాన్ని పది, ఇరవై రోజులు దాటితే గానీ కొనుగోళ్లు చేపట్టడంలేదు. ఈలోపు అకాల వర్షాలు కురవడంతో మళ్లీ ధాన్యాన్ని రైతులు ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోన్నది. గత రెండు వారాల నుంచి ఈదురుగాలులు, అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పగలు, ఎండ తీవ్రతతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే రాత్రిపూట వీస్తున్న ఈదురుగాలులు రైతులకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. పాలకులు, అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మరిచిపోయారు. అధికార యంత్రాంగం ప్రకటించినప్పటి నుంచి చేపట్టిన కొనుగోళ్లను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతది. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు దాటినా కొనుగోలు చేయడంలేదని ఓ రైతు చెప్పుకొచ్చారు. ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజుల అవుతుంది.. అప్పటి నుంచి ఎండలో అవస్థలు పడుతున్నామని మరో రైతు చెప్పారు. ఇంకొందరు రైతులైతే కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం సరిపోకపోవడంతో రోడ్లపైనే ధాన్యం పోసుకున్నామని చెబుతున్నారు. ఎప్పుడు కొనుగోళ్లు చేస్తారో తెలియడంలేదని, రోజూ ధాన్యం కుప్పల వద్దనే నిద్రపోతున్నానమని వారు వాపోతున్నారు.
సంతోషం లేకుండా..
ఈ ఏడాది వర్షాలు బాగా పడి దిగుబడి బాగా వచ్చిందన్న సంతోషం రైతులకు లేకుండా పోతోన్నది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు షురూ కాకపోవడంతో వారి లెక్కలలో తేడాలు ఉన్నాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం.
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయని ఆరా తీస్తే చాలా మంది రైతుల నుంచి అసంతృప్తిగానే సమాధానం వస్తోన్నది. కొనుగోళ్లు ఆలస్యం కాకుండా ఉండేందుకు అధికారులు నిత్యం మానిటరింగ్ చేస్తూనే ఉన్నా.. హమాలీల కొరత, ధాన్యం సంచుల కొరత ఉంది. ధాన్యం కొనుగోలుకు టోకెన్ల కేటాయింపుతోపాటు, గన్నీ సంచుల కోసం కుడా టోకెన్లు తప్పనిసరి అయ్యింది.
మార్పు రాలేదు..
నిజామాబాద్ జిల్లాలో 547 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసినా ఇప్పటి వరకు 340 కొనుగోలు కేంద్రాలలో మాత్రమే కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లాలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. రైతులకు రూ. 142 కోట్ల చెల్లింపులు జరిగాయి. అధికార యంత్రాంగం కొనుగోళ్ల వ్యవహారంపై సీరియస్ అయ్యింది. ఒక రైస్ మిల్, ధర్మకాంటాను సీజ్ చేసి, ఇద్ధరు సొసైటీ కార్యదర్శుల సస్పెన్షన్ తో పాటు ఇద్దరు లారీ కాంట్రాక్టర్లకు జరిమానా విధించినప్పటికీ ఇంకా పరిస్థితుల్లో మార్పు రాలేదు. సోమవారం ఒక్కరోజే 2 వేల టన్నుల ధాన్యం సేకరణతో పర్వాలేదనిపించారు అంతే. కామారెడ్డి జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ్యాల్సి ఉండగా ఇప్పటి వరకు 305 కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం సేకరణ జరుగుతోన్నది. 38,939 మంది రైతుల నుంచి లక్షా 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ట్యాబ్ లలో రికార్డు అయింది మాత్రం లక్షా 27 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. మరోవైపు గ్రామాలలో రైతుల వద్ధ మద్ధతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. నగదు ఆశతో రైతులు కూడా కమీషన్ ఏజెంట్ల వలలో చిక్కుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తరుగు వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో లాక్ డౌన్ సడలింపుల కారణంగా మహారాష్ట్ర నుంచి హమాలీల రాక షురూ కావడంతో కొనుగోళ్లలో మాత్రం కదలిక వచ్చింది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం మాత్రం నెలఖారు వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Tags: Nizamabad, farmers, grain, purchases delay, kamareddy