‘తెలంగాణలో కేసీఆర్ కుట్రలు .. కరోనా కట్టడి లేదు’
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్కు కుట్రలు చేయడంపై ఉన్న శ్రద్ధ కొవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందించడంలో లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. మే డే సందర్భంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు పంజాగుట్ట చౌరస్తాలో సోమాజిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు నరికేల నరేశ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాసోజు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసోజు […]
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్కు కుట్రలు చేయడంపై ఉన్న శ్రద్ధ కొవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందించడంలో లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. మే డే సందర్భంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు పంజాగుట్ట చౌరస్తాలో సోమాజిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు నరికేల నరేశ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాసోజు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాల కోసమే పని చేస్తున్నారని, తనకు ఎదురు మాట్లాడితే మంత్రుల్ని సైతం తొలగించాలనే కుట్రలు చేస్తాడని విమర్శించారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ఈ ఆపత్కర తరుణంలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవిడ్ సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని దాసోజు శ్రవణ్ తెలిపారు. తమ కార్యకర్తలు కొవిడ్ పేషెంట్లు పలువురికి ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజెక్షన్లు, బెడ్లు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా సకాలంలో అంబులెన్సులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో, రాష్ట్ర కార్యాలయాల్లో కొవిడ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా బాధితుల్ని ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మాస్కులు కూడా అందించలేని దుస్థితిలో ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన వైద్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని.. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు తీవ్ర స్థాయిలో పెరిగాయని, కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. కరోనాను నియంత్రించడం కంటే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న అంశంపైనే ప్రభుత్వాలు దృష్టిసారించాయని, పీఎం కేర్, సీఎం కేర్ పేరిట వచ్చిన నిధులు ఎమయ్యాయని ఆయన ప్రశ్నించారు. హై కోర్టు, సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీవాట్లు పెడుతున్నా దున్నపోతు మీద వాన కురిసినట్లు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు.