పార్టీని, నేతలను విమర్శిస్తే తిప్పి కొట్టాలి : సత్యవతి రాథోడ్
దిశ, ములుగు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, పార్టీపై విమర్శలు చేస్తుంటే వారికి టీఆర్ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జల్లా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయడంలో భాగంగా మంగళవారం జిల్లాలోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరైన సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు, తెలంగాణ […]
దిశ, ములుగు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, పార్టీపై విమర్శలు చేస్తుంటే వారికి టీఆర్ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జల్లా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయడంలో భాగంగా మంగళవారం జిల్లాలోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరైన సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు, తెలంగాణ సంస్కృతి, కళలు, అభివృద్ధి పట్టనివాళ్లు, కనీసం ఆ సోయి లేనివాళ్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, దానిని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై, పార్టీని విమర్శిస్తుంటే అలాంటి వారికి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సరైన రీతిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 12,673 గ్రామకమిటీలు, 143 మున్సిపల్ వార్డు కమిటీలు వేసుకున్నామన్నారు. ఈ నెల 12నుంచి 20వ తేదీ వరకు మండల కమిటీలు, డివిజన్ కమిటీలు వేసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరు వరకు జిల్లా కమిటీలు పూర్తిచేసుకుని అక్టోబర్ మొదటి వారంలో పార్టీ రాష్ట్ర కమిటీ వేసుకుంటామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో ఉద్యమ నాయకులు, అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వచ్చిన ఇతర నాయకులతో కలిపి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు.
కాబట్టి పోటీ కచ్చితంగా ఉంటుందని, ప్రతి పక్ష పార్టీల నేతల్లో అర్హత లేనివారు, స్థాయి లేనివారు కూడా టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ నేతలను విమర్శించినప్పుడు వాటిని సరైన రీతిలో తిప్పికొట్టాలన్నారు. రామప్ప విశిష్టతను గమనించి దీనికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, పరిశీలకులు గుడిమళ్ల రవికుమార్, నీల శ్రీధర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, గోవింద్ నాయక్, స్థానిక జడ్పిటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.