గంజాయి పట్టుకుంది ఎవరు..?
జిల్లా కేంద్రంలోని రైల్వేస్టషన్ లో దొరికిన గంజాయి కేసు విషయం కొత్త గొడవకు దారి తీసింది. గంజాయిని మేము పట్టుకున్నామంటే.. మేమని మూడు యునిఫాం సర్వీసులు ప్రచారం చేసుకోవడం కలకలం రేపుతోంది.
కేసులో తెరపైకి మూడు ముక్కలాట
కేసు కోసం యూనిఫాం సర్వీసుల మధ్య గొడవ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని రైల్వేస్టషన్ లో దొరికిన గంజాయి కేసు విషయం కొత్త గొడవకు దారి తీసింది. గంజాయిని మేము పట్టుకున్నామంటే.. మేమని మూడు యునిఫాం సర్వీసులు ప్రచారం చేసుకోవడం కలకలం రేపుతోంది. జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా వినియోగం జరుగుతుండటంతో యువత మత్తుకు బానిసయ్యారు. ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం గంజాయి వినియోగం, అక్రమ రవాణా విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది.
దొరికిన గంజాయి కేసును రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ మొదలుకుని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చివరకు వన్ టౌన్ పోలీసులు మేమే గంజాయి పట్టుకున్నామని ప్రచారం చేసుకోవడం విశేషం. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ వారికి దొరికింది 250 గ్రాముల గంజాయి కాగా, టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చే సరికి పది కిలోలుగా, 1వ టౌన్ పోలీసుల కేసు నమోదు వచ్చేసరికి 5 కిలోల గంజాయిగా చెబుతుండడం గందరగోళానికి దారి తీస్తోంది. మూడు యూనిఫాం సర్వీసుల మధ్య ఒకే ఒక్క కేసు విషయంలో జరిగిన తతంగం ప్రజలకు కొత్త అనుమానాలకు రేకెత్తిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 6న నిజామాబాద్ ఆర్పీఎఫ్ పోలీసులు నిజామాబాద్ రైల్వేస్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా 250 గ్రా. గంజాయిని డిచ్ పల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సుధీర్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన షెహబాజ్ వద్ద నుంచి కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారు. దీంతో తాము గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సీఐ సుబ్బారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఈ తరువాత ఏమైందో తెలియదు కానీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో పార్కింగ్ చేసిన బైక్ లో నుంచి గంజాయి ఉంచిన డిచ్ పల్లికి చెందిన సుధీర్, నాందేడ్ కు చెందిన షహబాజ్ నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వారిద్దరిని నిజామాబాద్ 1వ టౌన్ పోలీసులకు అప్పగించామని నిజామాబాద్ పోలీసు కమిషనర్ పేరిట పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
అదేవిధంగా సోమవారం నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నాందేడ్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ షహబాజ్, డిచ్ పల్లి మండలం మల్లాపూర్ కు చెందిన సుధీర్ గంజాయి రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు 1వ టౌన్ పోలీసులు కేటీఎం బైక్ పై వస్తున్న ఇద్దరిని పట్టుకుని వారి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కేసు నమోదు చేశారు. ఈ విధంగా ఒకే కేసును మూడు శాఖల వారు తామే పట్టుకున్నామంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా మారింది.