ఫేక్ డాక్టర్ ముసుగులో క్షుద్ర పూజలు.. ఇద్దరి అరెస్ట్

ఫేక్ డాక్టర్ ముసుగులో క్షుద్రపూజలు చేస్తున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హనమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2023-03-13 13:45 GMT

దిశ, హనుమకొండ టౌన్: ఫేక్ డాక్టర్ ముసుగులో క్షుద్రపూజలు చేస్తున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హనమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వివరాలు వెల్లడించారు. హన్మకొండ ఠాణా పరిధిలోని నయీం నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) , అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆసుపత్రి ప్రారంభించారు.


అయితే ఆసుపత్రి ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వైద్యశాఖ సిబ్బందితో ఫారహీన ఆసుపత్రిపై సోమవారం దాడులు చేశారు. అనంతరం సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53), అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మద్ (47) అదుపులోకి తీసుకొని విచారించారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..

వీరు ఎక్కువగా పౌర్ణమి, అమావాస్యలలో క్షుద్రపూజలు చేసేవారు. తన దగ్గరికి వచ్చిన వారికి వారి యొక్క రోగాలను నయం చేసే నెపంతో క్షుద్ర పూజలు చేయగా.. వారిని నమ్మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సయ్యద్ ఖాదిర్ అహ్మెద్ గతంలో కరీంనగర్‌లోని ఒక డాక్టర్ వద్ద సహాయకునిగా కొంత కాలం పనిచేసి అక్కడ వైద్యం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాడు. తన తండ్రి ఖరిముళ్ల ఖాద్రి గతంలో పూజలు చేసి తాయత్తులు కట్టేవాడు. ఈ అనుభవంతో అతను హనమకొండ లోని నయీంనగర్ లోని కెయుసి క్రాస్ రోడ్డు వద్ద గత 35 సంవత్సరాల నుండి తన స్వంత భవనంలో ఫారహీన క్లినిక్ నడుపుతున్నాడు.


పేరిట నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతి, ల్యాబ్ పత్రాలు లేకుండా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నారు. తన వద్దకు వచ్చిన రోగులకు వారిపై గిట్టని వారు చేతబడులు చేశారని, దెయ్యం పట్టిందని, నర దృష్టి ఉందని, మీలో దోషాలు ఉండడం వల్ల సంతానం కలగడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని, కుటుంబ తగాదాలు పరిష్కారం కోసం వారికి లేని పోనీ భయలను కలిగించి వాటిని పరిష్కరిస్తానని ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటానికి వారికి అల్లోపతి మందులు మంత్రించి ఇస్తున్నట్లు ఇచ్చి అవి వాడిన తర్వాత రోగం నయం అయితే క్షుద్రపూజాలు చేయడం వల్లనే తగ్గిందని నమ్మిస్తున్నారు.


ఇతను హన్మకొండలోనే కాకుండా హైదరాబాద్‌లో కొంత మంది రోగుల స్థితిని బట్టి వారి యొక్క స్వస్థలకి వెళ్ళి క్షుద్రపూజలు నిర్వహించేవాడు. ఇందులో అతనికి సహాయకులుగా ఉన్న సయ్యద్ షబ్బీర్ అహ్మద్ (46) ఉప్పల్, హైదరాబాద్ అదుపులోకి తీసుకుంది. క్షుద్రపూజలకి సహకరించిన యాకూబ్ బాబా, అతని భార్య సమరీన్, ఏం. డీ ఇమ్రాన్ వారు పరారీలో ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

వారి వద్ద నుంచి అల్లోపతి మందులు, క్షుద్ర పూజ సామాగ్రి, ల్యాబ్ టెస్ట్ సామగ్రి, ల్యాబ్ టెస్ట్ సామగ్రి, చరవాణి-01, టవేరా వాహనం, నగదు రూ. 3,00,000 స్వాధీనం చేసుకున్నారు. క్షుద్రపూజల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్ తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డిసిపి హెచ్చరించారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Tags:    

Similar News