గ్రే గోల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు మృతి
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని గ్రే గోల్డ్ సిమెంట్ ఫ్యాకర్టీలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.
దిశ మఠంపల్లి /నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని గ్రే గోల్డ్ సిమెంట్ ఫ్యాకర్టీలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని క్లింకర్ తయారు చేసే కిలాన్‌లో రా మెటీరియల్ జామ్ కావడంతో దాన్ని తీసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు అందులో చిక్కుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మఠంపల్లికి చెందిన మునగపాటి సైదులు (43) ప్రమాద స్థలంలోనే మృతి చెందగా... పట్టేటి సాయి (23 ) హుజూర్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వీరితోపాటు గుండెబోయిన సైదులు( 25) కు తీవ్రంగా గాయాలు అయ్యాయి.
గత మూడు నెలల క్రితం ఇదే ఫ్యాక్టరీలో కిలాన్ వద్ద పనిచేస్తున్న మఠంపల్లికి చెందిన గడపంగు సైదులు ఇలాగే ప్రమాదానికి గురై మృతి చెందాడు . కార్మికులకు సేఫ్టీ బర్నింగ్ సూట్ లేకపోవడం వలనే ఇలా ప్రమాదానికి గురయ్యారని తెలుస్తుంది. గతంలో ప్రమాదాలు గురైనప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు సేఫ్టీ పరికరాలను అందించకపోవడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు నెలల క్రితం ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందినప్పటికీ ఫ్యాక్టరీ యజమాన్యం నిర్లక్ష్యం విడకపోవడం వలనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.