సంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని 2 మృతదేహాలు లభ్యం

సంగారెడ్డి జిల్లాలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి.

Update: 2022-12-16 13:09 GMT

దిశ, అందోల్‌: సంగారెడ్డి జిల్లా అందోలు, వట్‌పల్లి మండలాల్లో వేర్వేరుగా రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అందోలు మండలం అల్మాయిపేట శివారులోని కోట రామకృష్ణకు చెందిన వ్యవసాయ భూమి సమీపంలో సంగుపేట గ్రామానికి చెందిన అశోక్‌ వ్యవసాయ పనులు చేయిస్తుండగా.. కెనాల్‌ కోసం త్రవ్విన కాలువలో శవం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గ్రామ మాజీ సర్పంచ్‌ రవిశంకర్‌ ఎస్‌ఐకి సమాచారం ఇవ్వడంతో సీఐ నాగరాజు, ఎస్‌ఐ సామ్యానాయక్‌లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా గుర్తు పట్టేందుకు ఎలాంటి ఆనవాళ్లు లేవు. కేవలం ప్యాంటు, షర్టు ఉండడంతో పురుషుడి శవంగా పోలీసులు గుర్తించారు. దాదాపు నెల రోజుల కిందట మరణించి ఉంటాడని, మృతుడు 50 నుంచి 55 ఏళ్ల మధ్యనుంటాడని పోలీసులు భావిస్తు్న్నారు. మృతుడి గుర్తింపు కోసం జిల్లాలోని పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సంఘటనా స్థలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించి అక్కడే పూడ్చిపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఖాదిరాబాద్‌లోని మంజీరా నది తీరాన మరో మృత దేహం..

వట్‌పల్లి మండల పరిధిలోని ఖాదిరాబాద్‌ గ్రామ శివారులోని మంజీర తీరంలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పంచాయితీ కార్యదర్శి సాయిబాబా ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరం మాత్రమే మిగిలి మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉంది. దాదాపు 20 రోజుల క్రితం మరణించి ఉండొచ్చని, మృతుడి వయస్సు 50 సంవత్సరాల వరకు ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కుడి చేతి మణికట్టుకు దారం ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పూడ్చి పెట్టనున్నట్లు చెప్పారు. మృత దేహానికి సంబంధించిన వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించామని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంబర్యా నాయక్‌ తెలిపారు.

Tags:    

Similar News