బొడ్రాయి పండుగ వేళ గ్రామంలో విషాదం.. బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి..
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న వేళ రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
దిశ, మిడ్జిల్: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న వేళ రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడ్యాల గ్రామానికి చెందిన పేట చంద్రమౌళి (37) శనివారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద పాలు తీసుకురావడానికి తన ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో చంద్రమౌళికి ఫిడ్స్ రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుకు సమీపంలో ఉన్న చెట్టుకు బలంగా ఢీకొంది.
దీంతో చంద్రమౌళి తలకు, ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కుటుంబ సభ్యులు 108 సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జిల్లా ఆస్పత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా వాడ్యాల గ్రామంలో శనివారం బొడ్రాయి ప్రతిష్ట చేపట్టి రాత్రి కోట మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమవగా గ్రామానికి చెందిన చంద్రమౌళి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.