హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
మండల కేంద్రానికి చెందిన షేక్ చాంద్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.
దిశ, మామడ : మండల కేంద్రానికి చెందిన షేక్ చాంద్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకుని గురువారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. షేక్ చాంద్ గ్రామ పంచాయతీ ద్వారా మేకల సంతను టెండర్ వేసి మేకలు కొనుగోలు చేసిన వారి నుంచి ప్రవేశ రుసుము వసూలు చేసేవాడు.
పెంబికి చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రెడ్డి, ఎల్లాపూర్ కు చెందిన సాయన్న కలిసి ప్రతి వారం సంతకు వెళ్లి మేకలు కొనుగోలు చేస్తుండేవారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో భాగంగా షేక్ చాంద్ వారిని రుసుము కట్టాలని అడిగాడు. దీంతో వారు తమను ప్రవేశ రుసుము అడిగితే చంపేస్తామని బెదిరించారు.
ఇదిలా ఉండగా.. బుధవారం రోజున శివరాత్రి మల్లేష్, రెడ్డి, సాయన్న మేకలు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తుండగా రూ.120 ప్రవేశ రుసుము చెల్లించాలంటూ షేక్ చాంద్ వారికి తెలిపాడు. దీంతో శివరాత్రి మల్లేష్, రెడ్డి, సాయన్న అతడితో వాగ్వాదానికి దిగారు. ఒకనోక దశలో వారిద్దరు సహనం కోల్పోయి షేక్ చాంద్ తల పట్టుకుని బండరాయికి బాదడంతో చాంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నవీన్ కుమార్, ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.