బాలాపూర్ లో భారీ అగ్నిప్రమాదం..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గ పరిధిలోని బాలాపూర్ లో శుక్రవారం 15 గుడిసెలు అగ్నికి అహుతి అయ్యాయి.
దిశ, బడంగ్ పేట్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గ పరిధిలోని బాలాపూర్ లో శుక్రవారం 15 గుడిసెలు అగ్నికి అహుతి అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గ పరిధిలోని బాలాపూర్ మంచి స్కూల్ వెనుక భాగంలో 200 గజాల ఓ ప్రయివేట్ స్థలంలో బీహార్, చతీస్ ఘడ్ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు గత నాలుగేళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఎప్పటిలాగానే కార్మికులు తమ రోజు వారి పనుల నిమిత్తం బయటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి గుడిసెల నుంచి పొగలు రావడం ప్రారంభమయ్యింది.
కాసేపటికే పక్క పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు విస్తరించాయి. ఈ ఘటనలో 15 గుడిసెల వరకు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. నిత్యావసర సరుకులు కాలిబూడిదయ్యాయి. ఒక ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను చల్లార్చారు. ఆ సమయంలో గుడిసెలలో ఎవరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఓ గుడిసెలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్నాక నిప్పులను ఆర్పి వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు జరిగిందా..? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు బాధితులు ఎవ్వరు కూడా బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.