ఆ గ్రామాల్లో పెద్దపులి, చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
నల్లమల అటవీ సమీప గ్రామ పరిసరాల్లో పెద్దపులి, చిరుతల సంచారం అధికమైంది.
దిశ, కర్నూలు ప్రతినిధి : నల్లమల అటవీ సమీప గ్రామ పరిసరాల్లో పెద్దపులి, చిరుతల సంచారం అధికమైంది. ఈ క్రమంలో పెద్ద అనంతాపురంలో పెద్దపులి ఆవుల మందపై దాడి చేసి రెండు ఆవులను పొట్టన పెట్టుకుంది. మరోవైపు ముష్టపల్లె గ్రామంలో నెల రోజులుగా చిరుత సంచరిస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్దపులి, చిరుతల సంచారంతో భయాందోళన చెందుతు న్నారు. అలాగే ఐదారు అటవీ సమీప గ్రామాల ప్రజలు ఉపాధి పనులతో పాటు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. అటవీ సమీప గ్రామాల వైపు అవి సంచరించకుండా పగలు, రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో తప్పెట్లు, డ్రమ్స్ తో పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ పహారా కాస్తున్నారు. అంతే కాకుండా కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. వాటి సంచారాన్ని గుర్తించి అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ ప్రయత్నం చేస్తోంది.నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని అటవీ సమీప గ్రామాలైన పెద్ద అనంతాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండగా ముష్టపల్లె గ్రామ పరిసర ప్రాంతంలో నెల రోజులుగా చిరుత సంచరిస్తోంది. దీంతో వాటి సమీప పరిధిలోని సిద్ధాపురం, సిద్దపల్లె, నల్లకాల్వ, ఎస్ఎన్ తండా వంటి గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాలు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో పెద్దపులి, చిరుతతో పాటు ఎలుగుబంట్ల సంచారం అధికమైంది. ఉదయాన్నే రైతులు పంట పొలాలకు వెళ్లాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో పొలాలకు వెళ్తూ సేద్యాలు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా నేటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. తీవ్ర ఎండలుండడం, అటవీ ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకపోవడంతోనే పెద్దపులులు, చిరుతలు, ఎలుగు బంట్లు జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల క్రితం పెద్ద అనంతాపురం గ్రామ శివారు ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది.
ఈ దాడిలో గ్రామంలోని లక్ష్మన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. దాడి సమయంలో పశువుల కాపరులు కేకలు వేయడంతో పెద్దపులి రెండు ఆవులను పొట్టన పెట్టుకుని అడవిలోకి పరుగులు తీసింది. తీవ్ర భయభ్రాంతులకు గురైన కాపరులు గ్రామంలోకి పరుగులు తీసి జరిగిన విషయాన్ని గ్రామస్తులకు, బాధిత రైతుకు తెలిపారు. వెంటనే రైతులు, బాధిత రైతు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. గ్రామస్తులు కర్రలతో అక్కడికి వెళ్లారు. మృత్యువాత పడిన ఆవుల విలువ దాదాపు రూ.70 వేల నుంచి రూ.80 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. రెండు ఆవులు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు.
గతంలోనూ ఇదే పరిస్థితి
ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లోని సిద్ధాపురం, ముష్టపల్లె, పెద్ద అనంతాపురం, ఎస్ఎన్ తండా, నల్లకాల్వ, పెద్ద గుమ్మడాపురం, పాలెం చెరువు, కొట్టాలచెరువు, ముసలిమడుగు వంటి ప్రాంతాల్లో గతంలో పెద్దపులులు సంచరించేవి. ఆ సమయంలో ఎస్ఎన్ తండా, సిద్ధాపురం, నల్లకాల్వ గ్రామాలకు చెందిన రైతుల ఆవులు, గొర్రెల మందలపై తరచూ దాడులు చేసి వాటిని చంపేసేవి. మేతకోసం ఉమ్మడి జిల్లాలోనే పెద్ద చెరువైన సిద్ధాపురం చెరువు, నల్లకాల్వ సమీప ప్రాంతాల్లో ఈ దాడులు అధికంగా జరిగేవి. ఆ సమయాల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున వాటి సంచారాన్ని అరికట్టేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేసేవారు. రాత్రి వేళల్లో డ్రమ్స్ శబ్ధాలు చేస్తూ పహారా కాసేవారు.
వీరికి తోడుగా ఆయా గ్రామాల ప్రజలు కూడా రాత్రి వేళల్లో మంటలు వేసుకుని మరీ కాపలా కాసేవారు. అదే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో ప్రస్తుతం పెద్దపులి, చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాలైన పెద్ద అనంతాపురం, ముష్టపల్లె గ్రామ mశివారుల్లో బైర్లూటీ రేంజ్ అధికారి రామకోటి ఆధ్వర్యంలో సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వాటి సంచారాన్ని గుర్తించేందుకు 4 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. ఎవరూ కూడా భయాందోళన చెందవద్దని, పెద్దపులి, చిరుత, ఎలుగుబంట్ల సంచారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రేంజ్ అధికారి అటవీ సమీప గ్రామాల ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.