బాలిక అదృశ్యం.. అతని పైనే అనుమానం..?
తల్లితో కలిసి బ్యాంకుకు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: తల్లితో కలిసి బ్యాంకుకు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా నూతనకల్ ప్రాంతానికి చెందిన స్వప్న రెండు రోజుల క్రితం తన కూతురు ఐశ్వర్య (14) తో కలిసి బ్యాంకు పనిమీద నూతన్ కల్ లో బస్సు ఎక్కి బోయిన్ పల్లి లో దిగారు. ఈ క్రమంలో తల్లి స్వప్న యూనియన్ బ్యాంక్ వెళ్ళాలని, కూతురుతో చెప్పడం జరిగింది. కాగా కూతురు ఐశ్వర్య తాను ఇక్కడే ఉంటాను, నీవు వెళ్ళిరా అని తల్లికి చెప్పడంతో బ్యాంకు పనిమీద తల్లి స్వప్న బయలుదేరి వెళ్లి బ్యాంకు పని ముగించుకుని తిరిగి వచ్చింది. అయితే బస్టాప్ లో ఉండాల్సిన తన కూతురు ఐశ్వర్య కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
సాయంత్రం వరకు కూతురు కోసం అక్కడే వేచి చూసింది. అయినా ఐశ్వర్య బస్సు బస్టాప్ వద్దకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి బంధువులకు ఫోన్ చేసి ఆరాతీసింది. అక్కడకు కూడ రాలేదు అని, సన్నిహితుల వద్దకు వెళ్లి ఉంటుందని తల్లి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. రెండు రోజులు కావస్తున్న ఐశ్వర్య ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆదివారం బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఐశ్వర్య కనిపించకుండా పోయిన రోజు తన అమ్మమ్మ సెల్ ఫోన్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఐశ్వర్య కు ఏదో మెసేజ్ చేసినట్లు గుర్తించారు. అతనిపైననే అనుమానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.