Crime : ప్రమాదవశాత్తు మంచం మీద పడి విద్యార్థి మృతి
ప్రమాదవశాత్తు హాస్టల్ గదిలో త్రిబుల్ మంచం తలపై పడి ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు.
దిశ, జహీరాబాద్: ప్రమాదవశాత్తు హాస్టల్ గదిలో త్రిబుల్ మంచం తలపై పడి ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. పట్టణంలోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ లో 5వ తరగతి చదువుతున్న సాత్విక్ (12) ఈ ప్రమాదంలో మృతి చెందాడు. కర్ణాటక శివ రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ 2వ కుమారుడైన సాత్విక్ రెండు సంవత్సరాలుగా స్థానిక పాఠశాలలో చదువుకుంటుందన్నాడు. శనివారం ఉదయం స్టడీ అవర్ జరుగుతుండగా ఆకస్మాత్తుగా
మంచం పై నుంచి విద్యార్థి తలపై పడడంతో తీవ్ర రక్త గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పాఠశాల యాజమాన్యం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ఆందోళన చేపట్టాయి. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని , విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి మృతి సంఘటనపై ఎస్ఐ. కాశీనాథ్ దర్యాప్తు చేస్తున్నారు.