21 మందిపై లైంగిక దాడి.. వార్డెన్ కు ఉరిశిక్ష

ఓ కీచక వార్డెన్ కు ఉరిశిక్ష విధించింది ప్రత్యేక కోర్ట్.

Update: 2024-09-26 15:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఓ కీచక వార్డెన్ కు ఉరిశిక్ష విధించింది ప్రత్యేక కోర్ట్. అతనితోపాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మరో మహిళా టీచర్ కు 20 ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. 2022 లో అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 21 మంది విద్యార్థులపై లైంగిక దాడి జరిపిన ఘటనలో నేడు పోక్సో(Pocso) న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. హాస్టల్ వార్డెన్ తమ పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణ చేపట్టింది. 2023 జులైలో ప్రత్యేక కమిటీ దాఖలు చేసిన ఛార్జీషీటులో వార్డెన్ సాగించిన అరాచకాలు వెళ్లడయ్యాయి. సదరు వార్డెన్ 2014 నుండి 2022 మధ్య 21 మంది మైనర్ విద్యార్థినీ, విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడ్డట్టు తేలింది.  లైంగిక దాడికి పాల్పడే ముందు విద్యార్థులకు మత్తు మందు ఇచ్చేవాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని, వార్డెన్ హింస తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారని నివేదికలో పేర్కొన్నారు. వార్డెన్ గురించి ఓ మహిళా టీచర్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ఆమె పట్టించుకోలేదని, ప్రధానోపాధ్యాయుడు పాఠశాల మీద సరైన పర్యవేక్షణ పెట్టలేదని దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కేసులో పోక్సో ప్రత్యేక కోర్ట్ విచారణ జరిపి వార్డెన్ కు ఉరిశిక్ష విధించగా.. ప్రధానోపాధ్యాయుడు, మహిళా టీచర్ కు 20 ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.


Similar News