వియ్యంకుడి చేతిలో వ్యక్తి దారుణ హత్య.. అసలు కారణం అదేనా..

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామంలో బుధవారం రాత్రి గాద నరహరి (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2024-09-26 15:20 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామంలో బుధవారం రాత్రి గాద నరహరి (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి తగాదాల కారణంగా ఆయన వియ్యంకుడు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వివరాలు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కంజర గ్రామానికి చెందిన గోవర్ధన్, అదే గ్రామానికి చెందిన వర్ష అనే యువతిని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక్క కుమార్తె ఉన్నారు. గోవర్ధన్ భార్య వర్ష నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తన భర్త పెట్టే హింసలను భరించలేకే వర్ష ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ అప్పట్లో వర్ష పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ష కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గోవర్ధన్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గోవర్ధన్ ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. వర్ష ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి ఆస్తిలో వాటా కావాలని కొద్ది రోజులుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

పిల్లలకు ఆస్తిలో వాటా డిమాండ్ పై గోవర్ధన్, ఆయన తండ్రి నరహరి ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ ముదిరింది. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వర్ష కుటుంబీకులు గోవర్ధన్ ఇంటికి వెళ్లారు. పాతకక్షలను మనసులో ఉంచుకుని గోవర్ధన్ తండ్రి గాద నరహరి కంట్లో కారం చల్లి కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్య కేసులో 8 మంది నిందితులను గుర్తించామని ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. మృతుడు నరహరి వియ్యంకుడు సత్యనారాయణ, వియ్యంకురాలు లలితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు వంశీ, మహేశ్, సందీప్, పూజిత, బాలకిషన్, రవిల పై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ రాజావెంకట్ రెడ్డి సందర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సౌత్ సీఐ నరహరి కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాల పై ఆరా తీశారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


Similar News