బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు ఇస్తామని మోసం చేసిన నిందితులు అరెస్ట్

తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి 7 లక్షల రూపాయలను తీసుకొని పారిపోయిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Update: 2024-09-26 16:40 GMT

దిశ, హుజూర్ నగర్ : తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి 7 లక్షల రూపాయలను తీసుకొని పారిపోయిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసులో సీఐ చరమంద రాజుతో కలిసి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి గురువారం రాత్రి విలేకరులకు వివరాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​ మండలం మోదుగుంట్ల గ్రామానికి చెందిన నోముల ప్రకాష్, నోముల మత్స్యగిరి అన్నదమ్ములు. వీరికి ఆత్మకూర్ ఎం మండల కేంద్రంలో ఓంసాయి ట్రేడర్స్ అనే టైల్స్ షాపు ఉంది. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం, అనుపాలెం గ్రామానికి చెందిన కొమెర రత్తయ్య కు తెలిసిన వ్యక్తులైన బత్తుల రేణు, డిరంగుల కృష్ణవేణి ముఠాగా ఏర్పడి అమాయక ప్రజలను ఎంచుకొని వారికి నకిలీ బంగారాన్ని అమ్మి డబ్బులు సంపాదించుకోవాలని భావించారు.

    ఈనెల 2న ప్రకాష్ అనే నిందితుడు మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్​ వ్యాపారి గోపిరెడ్డి వెంకట్ రెడ్డి తో తమ బంధువులు కొత్త ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో పాత ఇల్లు కూల్చివేస్తుండగా రెండు బంగారు బిస్కెట్ లు దొరికాయని, తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పి వెంకట్ రెడ్డి ని మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ మైన్స్ కు వెళ్లే దారిలోకి తీసుకువెళ్లారు. అక్కడ 7 లక్షల రూపాయలు తీసుకొని బంగారం ఇవ్వకుండా పారిపోయారు. ఇదే విషయమై ఈనెల 3న వెంకటరెడ్డి మఠంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఇదే నిందితులు చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన మాతంగి శ్రీను వద్ద కూడా 10వేల రూపాయలను అడ్వాన్స్ తీసుకొని బంగారం ఇవ్వలేదు.

    అతను గట్టిగా మందలించడంతో ఈనెల 26న నేరస్తులు శ్రీనుని హుజూర్నగర్ పట్టణంలోని మట్టపల్లి రోడ్డున ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు డబ్బులు తీసుకొని వస్తే బంగారం ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరు చెప్పిన వివరాల ప్రకారం కోదాడ పట్టణంలోని ఆర్కే లాడ్జిలో ఉన్న దేవరంగుల కృష్ణవేణి, బత్తుల రేణులను పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ. 7 లక్షల నగదు, 2 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులు ఐదుగురిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ చరమందు రాజు తో పాటు ఎస్సై ముత్తయ్య నరేష్, ఏఎస్ఐ బలరాం రెడ్డి, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు నాగరాజు, శంబయ్యను డీఎస్పీ అభినందించారు. 

Tags:    

Similar News