చెప్పుల దొంగలు చిక్కారు
రామంతపూర్ లో ఓ వింత దొంగలు ఉప్పల్ పోలీసులకు చిక్కారు.
దిశ,ఉప్పల్ : రామంతపూర్ లో ఓ వింత దొంగలు ఉప్పల్ పోలీసులకు చిక్కారు. ఇప్పటి వరకు ఇంట్లో నుంచి నగలు, డబ్బులు, బైక్, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లే దొంగలను చూశాం. కానీ ఇంటిగేటు బయట విడిచిన చెప్పులను, బూట్లను ఎత్తుకెళ్లే దొంగలను ఎప్పుడైనా చూశారా. అయితే ఈ వివరాలు చూడండి. తాళారీ మల్లేష్, రేణుక ఇద్దరూ దంపతులు. వీరు గత కొంత కాలం నుండి రామంతపూర్ వాసవినగర్ లో నివాసం ఉంటున్నారు. రెండు నెలల కాలంలో సుమారుగా 100 ఇళ్లలో వెయ్యి జతల చెప్పులను, బూట్లను ఎత్తుకెళ్లారు. వీటిని ఎర్రగడ్డలో రూ.100, రూ.200లకు విక్రయిస్తున్నారు.
దాంతో కాలనీవాసులు నాలుగు రోజులుగా నిఘా ఉంచగా వీరు దొరికారు. కాగా భర్త చెప్పుల దొంగతనాలు చేస్తుండగా అనుమానం రాకుండా భార్య కాలనీవాసులతో గొడవపడి వారిపైనే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేది. ఈ క్రమంలో ఓ రోజు నిందితురాలు రేణుక ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమె మద్యం సేవించిందని పోలీసులు గుర్తించి బ్రీతింగ్ అనలైజింగ్ పరీక్ష చేయడానికి ప్రయత్నించారు. దాంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగి అవును తాగొచ్చినా అయితే ఏంటి అని దబాయించింది. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కాగా ఎట్టకేలకు చెప్పుల దొంగలు దొరకడంతో కాలనీ వాసులు వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.