రూ.1.40 కోట్ల పందెం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్‌లైన్ బెట్టింగ్

బ్యాంక్‌లో జమ చేసిన ఖాతాదారుల సొమ్ముతో జూదం ఆడుతోన్న బ్యాంక్ అధికారుల బాగోతాలు వెలుగులోకి వస్తుండడం అందరిలో గుబులు రేపుతున్నాయి.

Update: 2024-10-05 02:49 GMT

దిశ, సిటీ క్రైం: బ్యాంక్‌లో జమ చేసిన ఖాతాదారుల సొమ్ముతో జూదం ఆడుతోన్న బ్యాంక్ అధికారుల బాగోతాలు వెలుగులోకి వస్తుండడం అందరిలో గుబులు రేపుతున్నాయి. హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసులో ఓ బ్యాంక్ అధికారి ఏకంగా రూ.1.40 కోట్లను ఖాతాదారుల ఖాతా నుంచి తీసి ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ పేకాటాడి పొగొట్టినట్లుగా తెలుస్తోంది. బ్యాంక్ ఆడిట్ సమయంలో అతడి విభాగానికి సంబంధించిన లెక్కల్లో తేడా రావడంతో రూ.1.40 కోట్ల వ్యవహారం బయటపడింది. ఉన్నతాధికారులు నిలదీయగా రూ.1.20 కోట్లు చెల్లించాడు. ఇది ఆరా తీస్తుండగానే మరో విభాగానికి చెందిన లెక్కల్లో రూ.1.20 కోట్లు తేడా వచ్చింది. అందుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదే అధికారి మరో క్లర్క్‌తో కలిసి గోల్‌మాల్‌కు పాల్పడినట్లుగా తేలింది. దీంతో బ్యాంక్ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సదరు అధికారి ఖాతాదారుల ఖాతాల నుంచి డబ్బు ఎలా తన సొంత ఖాతాలకు బదిలీ చేసుకున్నాడనే విషయంపై విచారణ చేపడుతున్నారు. ఖాతాదారులకు అధిక వడ్డీ ఇస్తానని.. మరేదైనా ఆశ చూపించాడా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Similar News