ఆప్ నేతకు బిగ్ రిలీఫ్.. ఆమెను కలిసేందుకు కోర్టు అనుమతి
ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు పెద్ద ఊరట లభించింది.
దిశ, వెబ్ డెస్క్: ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు పెద్ద ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను పరామర్శించేందుకు సిసోడియాకు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మల్టిపుల్ స్లెరోసిస్ తో తన భార్య బాధపడుతోందని, కావున తనకు బెయిల్ ఇవ్వాలని సిసోడియా రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ తన భార్యను చూసేందుకు మాత్రం సిసోడియాకు పర్మిషన్ ఇచ్చింది. అందుకు రేపు (శనివారం) ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చింది.
అయితే మొబైల్ ఫోన్ వాడటం, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం వంటివి చేయవద్దని ఆయనకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాను సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది. అనంతరం ఇదే కేసులో మార్చి 9న ఈడీ సిసోడియాను అరెస్ట్ చేసి తీహార్ జైలులో పెట్టింది. అప్పటి నుంచి సిసోడియా పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ తాజాగా భార్యను చూసేందుకు కోర్టు ఆయనకు 8 గంటలు పర్మిషన్ ఇచ్చింది.