పట్టపగలే చోరీ.. వృద్ధురాలిపై దాడి
పట్టపగలే ఇద్దరు దొంగలు 65 సంవత్సరాల వృద్దురాలి పై దాడి చేసి
దిశ, కల్వకుర్తి : పట్టపగలే ఇద్దరు దొంగలు 65 సంవత్సరాల వృద్దురాలి పై దాడి చేసి మెడలో ఉన్న 3 తులాల బంగారు తాడును దోపిడీ చేశారు. వివరాల్లోకి వెళితే కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ నోబెల్ పాఠశాల పక్కన ఒక పాడుబడిన ఇంట్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ (65) జ్యూస్ మిక్స్ వ్యాపారం చేస్తూ గత 3 ఏళ్ళుగా జీవనం సాగిస్తుంది. రోజు మాదిరిగానే శనివారం ఉదయం 9 గంటలకు పనులు ముగించి సేదతీరే సమయానికి ఇద్దరు దొంగలు కరెంట్ అధికారులమంటూ వృద్ధురాలితో మాట కలిపారు. దాదాపు అరగంట సేపు ముచ్చటించి ఒక్కసారిగా తిరుపతమ్మ ముఖం పై దాడి చేసి కత్తితో మెడపై పెట్టి బెదిరించి మెడ మీద ఉన్న 3 తులాల బంగారు తాడును తస్కరించారు. చెవి కమ్మలు లాక్కునే ప్రయత్నంలో బాధితురాలు కేకలు వేయడంతో ఆ ఇద్దరు దొంగలు పరారయ్యారు.
దాడికి ముందు 25నిమిషాలపైన రెక్కీ నిర్వహించి ఎవరు లేని క్రమంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ తతంగం చుట్టుపక్కల గల 4 సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉంది. సంఘటన జరిగిన కాసేపట్లోనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని బస్టాండ్ పరిసరాలు, చౌరస్తాలను అలర్ట్ చేశారు. తస్కరులను పట్టుకునే క్రమంలో పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. బస్టాండ్ కూతవేటు దూరంలో ఉండటంతో దుండగులు బస్ ఎక్కి వెల్లిపోయుంటరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానితులు ఎవరైనా చుట్టుపక్కల కనిపిస్తే సమాచారమివ్వాలని, అపరిచిత వ్యక్తులతో మాట్లాడటం, పరిచయాలు చేసుకోవడం ఇలాంటి ఘటనలకు దారి తీస్తుందని సీఐ నాగార్జున అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ మాధవ రెడ్డి అన్నారు.