దారి దోపిడీ దొంగలు రిమాండ్
అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని దారి దోపిడీకి పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
దిశ, కూకట్పల్లి : అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని దారి దోపిడీకి పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ రావు, కేపీహెచ్బీ సీఐ వెంకటేశ్వర్ రావుతో కలిసి వివరాలు వెల్లడించారు. జగద్గిరిగుట్టకు చెందిన మురహరిశెట్టి అంకమ్మరావు (31) ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కైత్లాపూర్ నుంచి కేపీహెచ్బీ కాలనీ బ్రాండ్ ఫ్యాక్టరీ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లోదా అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న నిర్మాణుష్య ప్రదేశంలో కొంత మంది హిజ్రాలు ఎదురు పడి అడ్డుకున్నారు. అదే సమయంలో వెనుక నుంచి రెండు బైకులపై వచ్చిన నలుగురు తమ చేతిలో ఉన్న కత్తులను చూపించి బెదిరించి అంకమ్మరావు మెడలో ఉన్న 1.5 తులాల బంగారు గొలుసు, ఐక్యూ 12 సెల్ ఫోన్‌ను లాక్కుని వెళ్లి పోయారు.
దీంతో బాధితుడు అంకమ్మరావు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా కపిలేశ్వరంనకు చెందిన వెంకట సురేష్ (28) గత కొన్నిరోజుల క్రితం నగరానికి వచ్చి మోతీనగర్‌లోని తన మిత్రుడు జగదీశ్ వద్ద ఉంటూ నగరంలోని టూరిజం ప్లేస్‌లను సందర్శిస్తున్నాడు. గురువారం రాత్రి బ్రాండ్ ఫ్యాక్టరీ నుంచి నాలుగవ ఫేజ్ రోడ్డులో వారు ఇద్దరు తమ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లోదా అపార్ట్మెంట్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వారిని బెదిరించి వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కుని అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో బాధితులు సురేష్, జగదీశ్ కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు అందిన రెండు ఫిర్యాదులతో కేసు నమోదు చేసి కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీఎస్, కేపీహెచ్బీ లా అండ్ ఆర్డర్ విభాగం ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
గండిమైసమ్మ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్న బీర్బల్ సింగ్ బీబాను (25), భాగేందర్ సింగ్ అలియాస్ బబ్లు సింగ్ (29), రవి సింగ్ బౌరి(20), దండు నాగేష్ అలియాస్ బబ్లు(20)లుగా పోలీసులు గుర్తించారు. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని ఇద్దరుగా రెండు గ్రూపులుగా విడిపోయి దారి దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కేపీహెచ్బీ సీఐ వెంకటేశ్వర్ రావు, డీఐ రవికుమార్, డీఎస్సై సమద్, క్రైం సిబ్బందిని ఏసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు.