రోడ్డు ప్రమాదం మిస్టరీ గుట్టురట్టు
మధిర మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్ద ఈనెల 12న రోడ్డు ప్రమాదంలో మరణించిన కోలికపోగు సోమయ్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
దిశ, మధిర : మధిర మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్ద ఈనెల 12న రోడ్డు ప్రమాదంలో మరణించిన కోలికపోగు సోమయ్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అది రోడ్డు ప్రమాదం కాదని, డ్రైవర్ లారీతో గుద్ది హత్య చేశాడని మధిర సీఐ మధు తెలిపారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 11న నాగపూర్ నుండి సివిల్ సప్లైకు చెందిన కందిపప్పు లోడుతో బయలుదేరిన లారీ 12న రాత్రి వైరాకు చేరింది. అక్కడి నుంచి మధిర మీదుగా విజయవాడ కు వెళ్లే క్రమంలో వైరా దాటిన తర్వాత ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన కోలికపోగు సోమయ్య వాహనాన్ని లారీ స్వల్పంగా ఢీకొట్టింది.
దాంతో ఆగ్రహంతో సోమయ్య లారీని ఓవర్టేక్ చేసి పాలడుగు వద్ద లారీ డ్రైవర్ రామిశెట్టి దుర్గారావుతో వాగ్వాదానికి దిగాడు. లారీ డ్రైవరు పట్టించుకోకుండా తిరిగి లారీతో వస్తుండగా కృష్ణాపురం గ్రామం దగ్గరకు వచ్చేసరికి సోమయ్య లారీని ఓవర్టేక్ చేసి లారీని అడ్డగించి తిరిగి వాగ్వాదానికి దిగాడు. దాంతో తాము చాలా దూరం వెళ్లాలని, క్షమించు తప్పు అయిందని డ్రైవర్ వేడుకున్నాడు. అయినా సోమయ్య వినకపోవడంతో క్లీనర్ సూచనతో డ్రైవర్ దుర్గారావు సోమయ్య పై నుంచి లారీ ఎక్కించగా మరణించాడు. అనంతరం డ్రైవరు, క్లీనర్ లారీని ముందుకు తీసుకువెళ్లి దెందుకూరు దాటిన తర్వాత మూలమలుపు వద్ద ఎల్లమ్మ గుడి పక్కన గల దారిలో లారీని నిలిపి పారిపోయారు. ఆ లారీని తీసుకెళ్లేందుకు డ్రైవర్, క్లీనర్ శుక్రవారం రాగా గమనించిన రూరల్ ఎస్సై బి.లక్ష్మీ భార్గవి వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చాకచక్యంగా కేసును రెండు రోజుల్లోనే ఛేదించిన రూరల్ ఎస్సై ను, సిబ్బందిని సీఐ మధు అభినందించారు.