న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తా.. ప్రీతి తండ్రి నరేందర్

Update: 2023-03-21 16:52 GMT

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: న్యాయం జరిగేవరకు పోరాటాన్ని కొనసాగిస్తానని మెడికో విద్యార్థిని ప్రీతి తండ్రి నరేందర్ చెప్పారు. ప్రీతి విషాదాంతంలో ఇంకా పూర్తి నివేదికలు రాకముందే వరంగల్ సీపీ రంగనాథ్ ఆమెది ఆత్మహత్య అయి ఉండవచ్చు లేదా గుండెపోటు వల్ల చనిపోయి ఉండవచ్చని మీడియాతో చెప్పటంపై ఆక్షేపణ వ్యక్తం చేసారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని నా బిడ్డకు గుండెపోటు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ప్రీతికి చేసిన వైద్యానికి సంబంధించి తనకు ఒక్క కాగితం కూడా ఇవ్వలేదని చెప్పారు.

కేసులో విచారణ పూర్తి స్థాయిలో జరగటం లేదన్నారు. కేఎంసీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, హెచ్ఓడిలు కేసు విచారణను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మొదటి రోజు హెచ్ఓడి తనతో ప్రీతి ఇంజక్షన్ తీసుకున్నట్టు చెప్పారని, ఇప్పుడు ఆ వాంగ్మూలమే లేదన్నారు. ప్రీతి ప్రాక్టికల్ కిట్ నుంచి అనస్తీషియా మందు సీసాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సీపీ రంగనాథ్ చెప్పారని, ఇందులో వాస్తవం లేదన్నారు. ప్రాక్టికల్ కిట్ ను ప్రీతి హాస్టల్ లోనే పెట్టిందని చెప్పారు.

డ్యూటీకి వచ్చినపుడు ఆస్పత్రిలోనే మందులు ఉంటాయన్నారు. అలాంటపుడు ప్రాక్టికల్ కిట్ ను ప్రీతి ఎందుకు వెంటబెట్టుకొని వస్తుందని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని సీపీ రంగనాథ్ కు పలుమార్లు చెప్పినట్టు వివరించారు. అయినా పోలీసులు మాత్రం ప్రీతి వద్ద నుంచి ప్రాక్టికల్ కిట్ స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారన్నారు. చూస్తుంటే కేసులో విచారణ సరిగ్గా జరగటం లేదనిపిస్తుంది అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సైఫ్ వెనక మరికొందరు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేసారు.

సైఫ్‌కు బెయిల్ ఇవ్వొద్దు..

ప్రీతి విషాదాంతంలో అరెస్ట్ అయిన సైఫ్‌కు బెయిల్ ఇవ్వొద్దని నరేందర్ అన్నారు. బెయిల్​కోసం సైఫ్​కోర్టులో పిటీషన్​వేసినట్టు చెప్పారు. బెయిల్ ఇస్తే అతను సాక్ష్యాలను రూపుమాపుతాడని చెప్పారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పినట్టు తెలిపారు. నా బిడ్డ విషాదాంతంలో సమగ్ర విచారణ జరపాలన్నదే తన డిమాండ్​అని చెప్పారు. న్యాయం జరగలేదని అనిపిస్తే అప్పుడేం చేయాలో అది చేస్తానన్నారు.

Tags:    

Similar News