నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న వ్యాపారి గుట్టురట్టు

అనుమతి లేని గోడౌన్ లో నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేస్తూ రైతులను మోసం చేస్తున్న వ్యాపారి గుట్టురట్టయింది.

Update: 2023-05-19 12:24 GMT

కనీస అనుమతు లేని పురుగు మందుల దుకాణం

నకిలీ, కల్తీ విత్తనాల క్రయ, విక్రయాలు

రైతులను నిండా ముంచిన వ్యాపారి

పంట నష్టపోయిన రైతు ఫిర్యాదుతో వెలుగులోకి

6-ఏ కింద కేసులు నమోదు చేస్తాం : డీఏవో నర్సింహారావు

దిశ, సంగారెడ్డి /సదాశివపేట : అనుమతి లేని గోడౌన్ లో నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేస్తూ రైతులను మోసం చేస్తున్న వ్యాపారి గుట్టురట్టయింది. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన రైతు నీరడి నగేష్ తన పంట చేనుకు గ్రామంలోనే అనుమతి లేకుండా విక్రయాలు జరుపుతున్న ఉదయ్ జైన్ వద్ద పురుగుల మందు కొనుగోలు చేసి పిచికారి చేశాడు. ఆ మందులు స్ప్రే చేసిన తరువాత నాలుగున్నర ఎకరాల్లోని పంట పూర్తిగా నాశమైంది.

దీనిపై గ్రామంలోని పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టగా పంట నష్టానికి సంబంధించి రూ.లక్షా ఇస్తానంటూ జైన్ తెలిపాడు. కాగా, నష్ట పరిహారం ఇస్తామని చెప్పి తొమ్మది నెలలు కాగా డబ్బు ఇవ్వాలని రైతు నగేష్ వ్యాపారిని అడుగగా ఏమి చేసుకుంటావో.. చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రైతు నగేష్ వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

కనీస అనుమతులు లేవని తెలిసినా నిర్లక్ష్యం..

ఆత్మకూర్ గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా శ్రీ హలమ ట్రేడింగ్ కంపెనీ పేరిట ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాన్ని గ్రామానికి చెందిన ఉదయ్ జైన్ ఏర్పాటు చేశాడు. అందులో నకిలీ విత్తనాలు, పురుగు మందులు తయారు చేసి గత కొన్ని సంవత్సరాలుగా విక్రయిస్తున్న విషయం వ్యవసాయ శాఖ అధికారులకు తెలిసినా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతోనే వ్యాపారి పెద్ద గోదాం ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నాడు.

కాలం చెల్లిన మందులు, షాంపులు, చిన్నపిల్లలు తినే పదార్థాలతో ఎరువులు, పురుగు మందులు తయారు చేసి విక్రయిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. సదాశివపేట మండల పరిధిలోని గ్రామాల్లోని రైతులు ఎక్కువగా పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పురుగు మందులు ఎక్కవగా కొంటారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారి జైన్ సుమారు రెండు వందలకు పైగా నకిలీ విత్తనాలు, పురుగు మందులను తయారు చేసి విక్రయిస్తున్నాడు. అంతే కాకుండా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే దర్జాగా విక్రయిస్తూ రైతులను నిలువునా ముంచుతూ రూ.కోట్లు ఆర్జించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

రైతు ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం..

గత సంవత్సరం తన పంటకు చల్లిన పురుగు మందుల వల్ల సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. నష్ట పరిహారం ఇస్తానని చెప్పిన వ్యాపారి మొండికేయడంతో రైతు నగేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదాశివపేట వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫెస్టిసైడ్స్ దుకాణాన్ని తనిఖీ చేశారు.

ఆ దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులకు నిషేదిత మందులు, కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులు, నకిలీ విత్తనాలు కనిపించాయి. అదే విధంగా వీడీ సైట్స్, గ్లైపో సెట్ వంటివి ఎలాంటి అనుమతి లేకుండానే విక్రయిస్తున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వ్యవసాయ శాఖ జిల్లా అధికారిని పంపించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శుక్రవారం దుకాణాన్ని తనిఖీ చేసి పలు రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను గుర్తించారు.

అనుమతి లేకుండా విక్రయాలు సాగిస్తున్న వ్యాపారిపై 6-ఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారు.. ఎలా విక్రయిస్తున్నారనే విషయాలను తెలసుకుంటున్నామని శనివారం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. దాడుల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ మనోహర, ఏఈవోలు శ్రీదేవి, కళ్యాణ్ దాస్, సదాశివపేట ఎస్సై సుదర్శన్, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News