వారిని పట్టుకునే వేట.. అయినా ఆగని వరుస దొంగతనాలు
తొమ్మిది ఇండ్లను ఒకే రోజు రాత్రి దొంగలు పడి ఊడ్చు కెళ్ళిన
దిశ,భిక్కనూరు : తొమ్మిది ఇండ్లను ఒకే రోజు రాత్రి దొంగలు పడి ఊడ్చు కెళ్ళిన ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు, వారిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు, సిసిఎస్ బృందాలు, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలతో పాటు, పక్కనే ఉన్న మెదక్, మేడ్చల్ రంగారెడ్డి, జిల్లాలలోకి కూడా వెళ్లి దొంగల కోసం వేటాడుతున్నారు. వారి వద్ద ఉన్న సమాచారంతోపాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్తున్నారు. హైవేను ఆనుకొని ఉన్న గ్రామాలనే టార్గెట్ గా చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతుండటంతో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్ పని అయి ఉండవచ్చన్న కోణంలో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో, వారం రోజుల క్రితం ఒక రోజు అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో చొరబడి, సుమారురూ. 15 లక్షల రూపాయల సొత్తును అపహరించుకుపోయారు. ఆ తర్వాత బాగిర్తి పల్లి గ్రామంలో ఒక ఇంట్లో చొరబడి రూ.లక్షా 75 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హైవే పక్కన బస్వాపూర్ పెద్దమ్మ ఆలయంలో దొంగతనానికి పాల్పడేందుకు యత్నించడం తో పాటు, మరో ఇంట్లో చోరీ చేసేందుకు విఫల యత్నం చేశారు. ఆ తరువాత అక్కడక్కడ చిన్నాచితక దొంగతనాలు స్టేషన్ పరిధిలో జరుగుతుండడం ఇటు ప్రజలను, అటు పోలీసులను కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం వేకువజామున, ఇండ్ల ముందు పార్క్ చేసి ఉంచిన ఐదు బైక్ ల తాళాలు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.