మెతుకు సీమలో మృత్యు కేక..!
మెతుకు సీమ మృత్యు కేక పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఒకే రోజు పలు కారణాలతో తొమ్మిది మంది ప్రాణాలు ఒదిలారు.
దిశ, మెదక్ ప్రతినిధి : మెతుకు సీమ మృత్యు కేక పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఒకే రోజు పలు కారణాలతో తొమ్మిది మంది ప్రాణాలు ఒదిలారు. కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే రోడ్డు ప్రమాదంలో మరొకరు.. చెరువులో దూకి ఇంకొకరు ఇలా పలు కారణాలతో ఒకే రోజు తొమ్మిది మంది మృత్యువాత పడడం చర్చనీయాంశంగా మారింది. మృతి చెందిన ఆ గ్రామాల్లో బుధవారం తీవ్ర విషాదం అలుముకుంది.
హవేలిఘనపూర్ మండలం ఫరీద్ పూర్ శివారులో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని మెదక్ మండలం మక్త భూపతిపూర్ గ్రామానికి చెందిన కర్రోల మల్లేశం అక్కడికక్కడే మృతి చెందగా అదే ప్రమాదంలో గాయపడిన కొల్చారం మండలం కొంగోడు గ్రామానికి చెందిన మేకల ఎల్లం పరిస్థితి విషమం ఉంది. దీనితో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. హవేలిఘనపూర్ మండలంలోని కాప్రయిపల్లిలో విద్యుదాఘాతంతో కుక్కలరాజు (30) అనే రైతు మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు పరిశీలించగా రాజు మృతి చెంది ఉన్నాడు.
మెదక్ రామాయంపేట జాతీయ రహదారి పై అవుసులపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని పాల ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటకు చెందిన నరేష్ గౌడ్ అక్కడికి అక్కడే మృతి చెందాడు. హావేలిఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ కు చెందిన గోపాల్ (45) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన పడిగే బాబు (31) భార్యతో గొడవ పడి పిల్లిగుండ్ల మత్తడి చెక్ డ్యాంలో పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. జిల్లాల్లో జే తూప్రాన్ మండలం ఘనపూర్ లో యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.
ఈ నెల 18 న వినాయక నిమజ్జనం రోజు గ్రామంలో చిన్న గొడవ జరిగిన నేపథ్యంలో గ్రామానికి చెందిన వంశీ (20) ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మేడ్చల్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా ఆర్ వీ ఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. పెద్ద శంకరంపేట శివారులోని మెల్ల శ్రీనివాస్ చారి (58) ఇంట్లో జోగిపేట వెళ్తున్నట్టు చెప్పి వెళ్లి చెరువులో శవమై తేలాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు. చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన భూస రమేష్ చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అల్లాదుర్గం మండలంలోని చేవెళ్ల గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాల్లో ఒకే రోజు తొమ్మిది మంది వివిధ కారణాలతో మృతి చెందడం పలువురిని కలిచి వేసింది. మృతి చెందిన వారిలో అత్యధికులు యువకులే కావడం గమనార్హం.