NZB: విద్యార్థి అనుమానాస్పద మృతి.. స్కూల్ యాజమాన్యం వాస్తవాలు దాస్తోందని పేరెంట్స్ ఫైర్
నిజామాబాద్(Nizamabad) నగరంలోని కాకతీయ స్కూల్(Kakatiya School)లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్(Nizamabad) నగరంలోని కాకతీయ స్కూల్(Kakatiya School)లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం వాస్తవాలను దాచిపెడుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కొడుకు చనిపోవడానికి కాకతీయ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్(NZB Fourth Town Police Station)లో ఫిర్యాదు కూడా చేశారు. తన కుమారుడి మృతిని విద్యార్థి సంఘాలు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. బోధన్ మండలం ఆచన్‌పల్లికి చెందిన గుడాల శివజశ్విత్ రెడ్డి కాకతీయ స్కూల్‌లోని హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి నుంచి విద్యార్థి అనారోగ్య లక్షణాలతో పలుమార్లు వాంతులు చేసుకున్నట్లు, జలుబు, జ్వరంతో బాధపడ్డట్లు తోటి విద్యార్థుల ద్వారా తెలిసింది. సడన్‌గా శుక్రవారం ఉదయం జశ్విత్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం మీద అనుమానంతో కంప్లైంట్ చేశారు. విద్యార్థి అనుమానాస్పందంగా మృతిచెందాడని తెలిసినా కూడా విద్యార్థి సంఘాలు మౌనంగా ఉండటంపై బాలుడి తండ్రి పాఠశాల యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేశాడు. అనారోగ్యం బారిన పడినరోజే తమ కుమారుడ్ని ఆసుపత్రికి తరలించి ఉంటే బతికి ఉండే వాడని రోధిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు.