మియాపూర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..
వీకెండ్ కావడంతో సరదాగా గడుపుదామని అర్ధరాత్రి బైక్ పై బయటకు వెళ్లిన స్నేహితులని లారీ ఢీకొంది.
దిశ, శేరిలింగంపల్లి : వీకెండ్ కావడంతో సరదాగా గడుపుదామని అర్ధరాత్రి బైక్ పై బయటకు వెళ్లిన స్నేహితులని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. శనివారం అర్ధరాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన గోపి (22), కార్తీక్ (23) మంచి స్నేహితులు. మాదాపూర్ లో ఒకే హాస్టల్ లో ఉంటూ జాబ్ చేస్తున్నారు. అయితే వీకెండ్ కావడంతో శనివారం రాత్రి సరదాగా గడిపేందుకు తమ బైక్ పై బయటకు వెళ్లారు.
అర్ధరాత్రి సమయంలో కూకట్ పల్లి వైపు నుండి లింగంపల్లి వైపు వస్తున్న క్రమంలో వేగంగా వచ్చి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు పై ఉన్న లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో గోపీ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా కార్తీక్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు. మృతి చెందిన గోపి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అలాగే తీవ్ర గాయాలపాలైన కార్తీక్ ను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.