మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్ట్
మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ,దుమ్ముగూడెం : మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుమ్ముగూడెం మండలం సీతానగరంలో గురువారం దుమ్ముగూడెం పోలీసులు, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ చత్తీస్గడ్ రాష్ట్రం ఫార్మేట్ ఏరియా కమిటీ అనుబంధంగా పనిచేస్తున్న క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘానికి చెందిన అజ్ఞాత దళ సభ్యురాలిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన దళ సభ్యురాలి వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కొత్తగూడ గ్రామానికి చెందిన ఓయెమ్ నందే అలియాస్ సమ్మక్కగా గుర్తించారు.
ఓయెమ్ నందే తన 16వ ఏట 1999 సంవత్సరం నుండి 2002 వరకు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన బాసగూడ ఏరియా బాలల సంఘంలో సభ్యురాలిగా పని చేసింది. అనంతరం 2002వ సంవత్సరం నుండి 2018 వరకు చత్తీస్గడ్ రాష్ట్రం పామేడ్ ఏరియాలో క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘంలో దళ సభ్యురాలుగా, 2018 నుండి నేటి వరకు ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తుంది. కేఏఎంఎస్ లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల ఆదేశాల ప్రకారం తన తోటి దళ సభ్యులతో పామేడు ఏరియాలోని ఆదివాసీ గ్రామాల్లో సంచరిస్తూ సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీతో కలిసి తిరుగుబాటు చేసే విధంగా అమాయక ఆదివాసీ ప్రజలను ప్రేరేపిస్తుంది. ఈమె నుండి మావోయిస్టు పార్టీకి చెందిన కరపత్రాలు, సాహిత్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.