లింగ నిర్ధారణ చేస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవు : డీ.ఎం.హెచ్.వో లలితా దేవి
ఫ్రీ-కాన్సెప్షన్, ప్రీ నేటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ చట్టం -1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట వ్యతిరేకమని, ఆస్పత్రి యజమాన్యాలు అలాంటి వాటికి పాటుపడితే చట్టపర్యమైన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లలితాదేవి అన్నారు.
జమ్మికుంటలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ సీజ్
దిశ, జమ్మికుంట : ఫ్రీ-కాన్సెప్షన్, ప్రీ నేటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ చట్టం -1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట వ్యతిరేకమని, ఆస్పత్రి యజమాన్యాలు అలాంటి వాటికి పాటుపడితే చట్టపర్యమైన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లలితాదేవి అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో శ్రీ విజయ సాయి ఆసుపత్రితో పాటు పలు ఆసుపత్రులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేసిన శ్రీ విజయ సాయి హాస్పిటల్ లోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ ను తహసీల్దార్ సమక్షంలో సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్ లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ రాజేశ్వరి, పట్టణ సీఐ బర్పటి రమేష్, డాక్టర్ వినీత, రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అయితే, జిల్లా వైద్య బృందం మూడు బృందాలుగా విడిపోయి పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న విలేకరులు వెళ్లి అధికారులను వివరాలు అడగ్గా వారు వెల్లడించేందుకు నిరాకరించారు. కాగా, వైద్య బృందాలు పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని దావానంలా వ్యాపించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యాధికారులు విషయాలను బయటకు వెల్లడించారు.