శ్మశాన వాటికలో అర్థరాత్రి క్షుద్ర పూజల కలకలం... గ్రామస్థులు బెంబేలు
దేశం ఓ వైపు టెక్నాలజీతో దూసుకెళ్తుంటే.. కొన్ని గ్రామాల్లో మాత్రం మూఢ నమ్మకాలు ఇంక ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.
దిశ, చేర్యాల : దేశం ఓ వైపు టెక్నాలజీతో దూసుకెళ్తుంటే.. కొన్ని గ్రామాల్లో మాత్రం మూఢ నమ్మకాలు ఇంక ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. దయ్యాలు, భూతాలు అంటూ కొందరు అంధ విశ్వాసంలో మునిగి తేలుతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, చేర్యాల మండల పరిధిలోని చుంచనకోట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామ శివారులోని దళితులకు చెందిన శ్మశానవాటికలో క్షుద్ర పూజలు చేశారు. అదే గ్రామానికి చెందిన సూతారి రమేష్ అనే వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్తున్న క్రమంలో శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్నట్లుగా గమనించిన రమేష్ గ్రామస్థులకు సమాచారం అందజేశాడు.
దీంతో కొంత మంది గ్రామస్థులు శ్మశానవాటిక వైపు వెళ్లగా క్షుద్ర పూజల్లో కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తులు వారిని చూసి అక్కడి నుంచి పరారైనట్లుగా గ్రామస్థులు తెలిపారు. కాగా, గ్రామంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే అనారోగం పాలైన ఐదుగురు ఆకస్మికంగా మృతి చెందరాని గ్రామస్థులు తెలిపారు. ఇదే విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే చూసిన, తెలిసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్థులకు పోలీసులు సూచించారు.