బంగారం లూటీ కేసులో పోలీసుల వేట
హర్ష జువెలర్స్ బంగారం లూటీ కేసులో హైదరాబాద్ పోలీసులు గాలింపును వేగవంతం చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఐటీ అధికారుల ముసుగులో ఆగంతకులు కిలోన్నరకు పైగా బంగారు నగలను తీసుకుని ఉడాయించిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేరానికి పాల్పడింది మహారాష్ర్టకు చెందిన గ్యాంగ్ అని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందాలు మహారాష్ర్టలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలోని హర్ష జువెలర్స్ కు శనివారం అయిదుగురు వ్యక్తులు వచ్చి తమను తాము ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. సిద్ధం చేసి పెట్టుకున్న నకిలీ గుర్తింపు కార్డులను చూపించటంతో జువెలరీ షాపులో మేనేజర్‌గా పని చేస్తున్న మధుకర్‌తో పాటు మిగిలిన సిబ్బంది వచ్చింది నిజంగానే ఐటీ అధికారులని నమ్మారు.
రికార్డులు పరిశీలించినట్టుగా కొద్దిసేపు హడావిడి చేసిన అగంతకులు ఆదాయం పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ షాపులో ఉన్న 170 తులాల బంగారు బిస్కెట్లు, నగలను మూటగట్టుకున్నారు. వీటిని సీజ్చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తరువాత మధుకర్ పక్కనే ఉన్న జువెలరీ షాపుల్లో కూడా దాడులు జరిగాయా? అని వాకబు చేయగా జరగలేదని తెలిసింది. దాంతో తమ షాపులో ఐటీ అధికారులు దాడి చేసి బంగారాన్ని సీజ్ చేసుకెళ్లారని మధుకర్ ఇతర జువెలరీ వ్యాపారులతో చెప్పాడు. నగలను సీజ్ చేసినట్టు అధికారికంగా ఏదైనా లెటర్ ఇచ్చారా? అని వాళ్లు ప్రశ్నించగా లేదని తెలిపాడు. దాంతో మిగితా వ్యాపారులు ఆదాయపు పన్ను శాఖ అధికారులైతే ఖచ్చితంగా నగలను స్వాధీనం చేసుకున్నట్టుగా సీజర్పంచనామా చేసి ఇస్తారని మధుకర్‌తో చెప్పారు. దాంతో మోసం జరిగిందని గ్రహించిన మధుకర్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా నగలతో పరారైన దుండగులు ముందుగా ఆటోలో జూబ్లీ బస్‌స్టేషన్‌కు వెళ్లినట్టు గుర్తించారు. అక్కడి నుంచి కూకట్పల్లి వైపు వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు. పటాన్చెరు ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో కూడా దొంగల కదలికలు నమోదైన నేపథ్యంలో ఈ ముఠా మహారాష్ర్టకు చెందినదై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన అయిదు ప్రత్యేక పోలీసు బృందాలు నిందితులను గాలిస్తూ మహారాష్ర్టలోని వేర్వేరు ప్రాంతాలకు బయల్దేరి వెళ్లాయి. అదే సమయంలో హర్ష జువెలర్స్‌లో పని చేస్తున్న సిబ్బందిలో ఎవరికైనా ఈ గ్యాంగ్ సభ్యులతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.