గిరిజన మహిళ దారుణ హత్య..!

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం, రామగిరి కొండల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2023-04-15 17:00 GMT

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్/కల్వకుర్తి/ తెలకపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం, రామగిరి కొండల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్వకుర్తి మండలం ఎల్లికల్లు తండాకు చెందిన మిమ్లీ (45), తన భర్త సారయ్యతో కలిసి కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని కల్లు దుకాణంలో ఈ నెల 11వ తేదీన కల్లు సేవించారు. కొద్దిసేపటికే మిమ్లీ, ఆమె భర్త సారయ్య మత్తులోకి జారుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ జంట తమ దృష్టిని మిమ్లీ ఒంటిపై ఉన్న ఆభరణాల వైపు సారించారు.

ఇద్దరూ కలిసి నగలు దోచుకునేందుకు పథకం వేసుకున్నారు. అందులో భాగంగానే మిమ్లినీ బైక్ పై ఎక్కించుకొని నాగర్ కర్నూల్ చేరుకున్నారు. మరుసటి రోజు నాగర్ కర్నూల్ పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించారు. మిమ్లీకి మద్యం ఎక్కువగా తాగించి మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెను సదరు జంట తెలకపల్లి మండలం రామగిరి గుట్టల్లోకి తీసుకెళ్లి బండరాళ్లతో మోది హతమార్చారు. అనంతరం మృతురాలు మెడలో ఉన్న మూడు తులాల బంగారం పుస్తెలతాడు, వెండి ఆభరణాలను దొంగిలించారు. మృతురాలి భర్త కల్వకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న కల్వకుర్తి పోలీసులు ఆచూకీ కోసం సీసీ ఫుటేజ్ లా ఆధారంగా గాలించగా నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ పై నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని వెతకగా శనివారం రాత్రి రామగిరి గుట్టల నడుమ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. వెంటనే పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన శ్రీశైలం కాగా, అతనికి సహకరించిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News