మైనర్ బాలికపై కన్నేసినందుకే మట్టుబెట్టారు..
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ కూతురుపైనే కన్నేశాడు ఆ కామాంధుడు.
కొల్చారం గోనె సంచి హత్య మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు
వివాహేతర సంబంధం ఉన్న మహిళ కూతురిపై కన్ను
హత్యకు ప్రధాన సూత్రధారి మహిళే..
దిశ, మెదక్ ప్రతినిధి : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ కూతురుపైనే కన్నేశాడు ఆ కామాంధుడు. పలుమార్లు వేధించడంతో అతడి బారి నుంచి తన కూతురుని కాపాడుకునేందుకే ఐరన్ రాడ్ తో కొట్టి హత్య చేసి గోనె సంచిలో కట్టి మంజీరలో పడేసినట్లు మెదక్ డీఎస్పీ సైదులు వెల్లడించారు. కొల్చారం మండలం ఏడుపాయల శివారులోని హత్య చేసి మంజీరాలో గోనె సంచిలో చుట్టి పడేసిన నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ తన కార్యాలయంలో వెల్లడించారు.
కొల్చరం మండలం ఏడుపాయల సమీపంలోని మంజీరాలో 25న గోనె సంచిలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడి మోహం గుర్తు పట్టలేని విధంగా ఉంది. హత్యకు గురైన వ్యక్తి ఒంటిపై వీరయ్య, జంగయ్య అని రాసి ఉండడంతో అదే మచ్చ ఉన్న వ్యక్తి మిస్సింగ్ కేసు బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ లో నమోదు కావడంతో హత్యకు గురైన వ్యక్తి పటాన్ చెరువు మండలం పాటి ఘనపూర్ కు చెందిన కావాలి రాములుగా గుర్తించారు. హత్యకు గురైన రాములు మూడేళ్లుగా నందిగా కు చెందిన మ్యాదరి వీరమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
దీంతో వీరామణిని విచారించగా హత్య కు గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. వీరమణితో వివాహేతర సంబంధం మూడేళ్ల నుంచి రాములు కొనసాగిస్తున్నాడు. అయితే, వీరమణికి ఉన్న మైనర్ కుమార్తెపై రాములు కన్ను పడింది. దీంతో తన కూతురు పట్ల రాములు చాలా మార్లు అసభ్యంగా ప్రవర్తించనట్లు వీరమణి తెలిపింది. దీంతో రాములును వీరమణి దూరం పెట్టినా.. అతడి వేధింపులు ఏమాత్రం ఆగలేదు. విషయాన్ని బంధువుల దృష్టికి తీసుకువెళ్లడంతో రాములును హతమార్చేందకు పథకం వేశారు.
ఇందులో భాగంగా 17న మెదక్ వచ్చిన వీరామణి బంధువులు, స్నేహితులైన కౌడిపల్లికి చెందిన మ్యాదరి నర్సింహులు, వీర్ సింగ్, పట్నం మహేష్, మహమ్మద్ ఆరీఫ్, మెదక్ పట్టణం ఫతేనగర్ కు చెందిన అనిరుధ్, మ్యాదరి స్వప్నల సహకారంతో మెదక్ వచ్చిన రాములును అనిరుధ్ ఇంటికి తీసుకువచ్చారు. కొత్తగా కొనుగోలు చేసి తీసుకొచ్చిన ఇనుప రాడ్ తో రాములు తలపై బలంగా కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఆటోలో కొల్చారం మండల శివారులోని ఏడుపాయల చెక్ డ్యాం సమీపంలోని మంజీరాలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
25న ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దుర్వాసన రావడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. హత్యకు కారణమైన ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న ఇనుప రాడ్, ఆటోను సీజ్ చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ సైదులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి హత్య మిస్టరీ కేసును కేవలం కేవలం 36 గంటల్లోనే ఛేదించిన కొల్చారం పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఎస్పీ ద్వారా రివార్డును అందజేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తో పాటు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.