ఘట్కేసర్ మార్ఫింగ్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు
ఘట్కేసర్ వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ అమ్మాయిల ఫోటో మార్ఫింగ్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దిశ, వెబ్ డెస్క్: ఘట్కేసర్ వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ అమ్మాయిల ఫోటో మార్ఫింగ్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్ ను పోలీసులు విజయవాడలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రదీప్ కి అదే కాలేజీలో చదివే అమ్మాయితో పరిచయం ఏర్పడగా కొన్నేళ్లు ఛాటింగ్ చేశాడు. ఇద్దరూ దగ్గరయ్యాక ఆమె ద్వారా యువతి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ ల్లో చేరాడు. ఆపై ఇతర అమ్మాయిల నెంబర్లను సంపాదించాడు.
వారితోనూ ఛాటింగ్ చేసి వాళ్ల వాట్సాప్ డీపీలను సేకరించాడు. రెండు గ్రూప్ లను క్రియేట్ చేసి అందులో వీబీఐటీ విద్యార్థినులను చేర్చాడు. గ్రూప్ ల్లో కొన్ని లింక్ లు పంపి వారి పర్సనల్ డాటాను హ్యాక్ చేశాడు. ఇలా మొత్తం 43 మంది సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. డేటాను డార్క్ నెట్ సైట్ లో ఉంచి డబ్బులు సంపాదించాడు. ఫేక్ ఫోటోలను యువతులకు పంపి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ప్రదీప్ వేధింపులు భరించలేక యువతులు ధర్నాకు దిగడంతో పోలీసులు కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని నిందితున్ని పట్టుకున్నారు.