చిట్టీల పేరిట ఘరానా మోసం.. బాధితుడి సూసైడ్
తిరుపతిలో కోట్ల రూపాయల చిట్టీ డబ్బులతో దంపతులు పరారు కావడం సంచలనం సృష్టించింది.
దిశ, తిరుపతి : చిట్టీ డబ్బులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి వేధిస్తున్న చీటి నిర్వాహకులు తీరుతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుచానూరు పంచాయతీ ఎస్వీపి కాలనీలో చోటు చేసుకుంది. తిరుచానూరు పంచాయతీ ఎస్వీపి కాలనీకి చెందిన నితిన్‌సింగ్ స్థానికంగా ప్రొవిజన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో తన అవసరాల నిమిత్తం ఇంటి పరిసరాల్లో నమ్మకంగా చీటిలు నిర్వహిస్తున్న వాణి, ఆమె భర్త ప్రతాప్ స్వామి అలియాస్ బాబు స్వామి(అమ్మవారి ఆలయం ప్రధాన అర్చకులు ) వద్ద పెద్ద మొత్తంలో చీటీలు వేసాడు. చీటీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నా తనకు రావాలిసిన డబ్బులు ఇవ్వకుండా దంపతులు ఇద్దరు రోజుకో మాట చెబుతుండేవారు.
దీంతో అడిగి అడిగి విసిగి వేసారిన నితిన్ మనస్తాపం చెంది తన చావుకు కారణం చీటి నిర్వహిస్తున్న దంపతులే అని లేఖ రాసి తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సోమవారం తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు.
నితిన్ చావుకు కారణమైన చీటి నిర్వాహకులు వాణి, ఆమె భర్త ఆలయ అర్చకులు బాబు స్వామిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.