జన్మదిన వేడుకలకు వెళ్తూ నలుగురు మృతి..
కూతురి పుట్టినరోజు వేడుకల కోసం ఇద్దరు పిల్లలతో కలిసి తన బావ ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ట్రాక్టర్ రూపంలో మృత్యువు నాలుగు నిండు ప్రాణాలను కబలించింది.
దిశ, తూప్రాన్ : కూతురి పుట్టినరోజు వేడుకల కోసం ఇద్దరు పిల్లలతో కలిసి తన బావ ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ట్రాక్టర్ రూపంలో మృత్యువు నాలుగు నిండు ప్రాణాలను కబలించింది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మనోహరబాద్ మండల పరిధిలోని పోతారం గ్రామానికి చెందిన మన్నె కుమార్ లావణ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు సంజన తన అమ్మమ్మ నివాసమైన వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నది. శనివారం సంజన పుట్టినరోజు కావడంతో లావణ్య (35), రెండో కుమార్తె సహస్ర (10), చిన్న కూతురు శాన్వి (7) తో కలిసి పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తన భర్త వ్యవసాయ పనుల్లో ఉండడంతో బావ (భర్త అన్న) మన్నె ఆంజనేయులు(50) ద్విచక్ర వాహనం పై శభాష్ పల్లి చౌరస్తాలో దించేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే స్థానిక ప్రాణా ఫుడ్స్ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వేగంగా ఢీ కొనడంతో బైక్ పై వెళుతున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీనితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు మృతదేహాలను తరలించమని బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సర్దిచెప్పి మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.