Tragedy:ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
నూతన సంవత్సరం రోజున విజయవాడ చెన్నై జాతీయ రహదారిపై మార్టూరు పోలీస్ సర్కిల్ పరిధిలో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.
దిశ,బాపట్ల: నూతన సంవత్సరం రోజున విజయవాడ చెన్నై జాతీయ రహదారిపై మార్టూరు పోలీస్ సర్కిల్ పరిధిలో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఓవర్టేక్ చేసి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన కొల్లు రాము భార్య అయిన కొల్లు ఉమా (29) తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు అత్యవసర వైద్యం కోసం ముందుగా చిలకలూరిపేటకు, అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతి చెందిన వారు విజయవాడ బాంబే కాలనీకి చెందిన పల్లపు గోపి (29), కొల్లు రాము (32) గా పోలీసులు గుర్తించారు. బల్లికురవ మండలం, ధర్మవరం చర్చిలో ప్రార్థనకు వెళుతున్న సమయంలో జాతీయ రహదారిపై రాజుపాలెం రెస్ట్ ఏరియా వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మార్టూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన కొల్లు రాము, పల్లపు గోపి విజయనగరం జిల్లా నుంచి విజయవాడకు వలస వచ్చిన కార్మికులుగా తెలుస్తోంది.