నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల రాకెట్ గుట్టురట్టు..ఇద్దరు అరెస్ట్
నకిలీ విద్యా సర్టిఫికెట్ రాకెట్ గుట్టును సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
దిశ, చార్మినార్ : నకిలీ విద్యా సర్టిఫికెట్ రాకెట్ గుట్టును సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 84 నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం .... అంబర్పేట్ ఓవైసీ నగర్‌లోని ఎంఎస్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఉన్న జిరాక్స్ సెంటర్‌పై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ విద్యా సర్టిఫికెట్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ కి చెందిన నకిలీ విద్యా సర్టిఫికేట్లను తయారు చేస్తూ పెద్ద మొత్తంలో విక్రయిస్తున్న మొహమ్మద్ మహఫూజ్ ఇక్బాల్ అలియాస్ ఇక్బాల్ (41) అంబర్పేట్ ఓవైసీ నగర్‌లోని ఎంఎస్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఉన్న జిరాక్స్ సెంటర్ ను గత కొంతకాలంగా నడిపిస్తున్నాడు.
అంబర్ పేట కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ (34) స్నేహితుడు. గత కొంత కాలంగా అతని వ్యాపారంలో నష్టం రావడం తో స్నేహితుడు షేక్ ఇలియాస్ అహ్మద్ తో కలిసి మొహమ్మద్ మహఫూజ్ ఇక్బాల్ నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేయాలనే పథకాన్ని రూపొందించారు. ఈ నేపధ్యంలోనే ఇంటర్, డిగ్రీ కి సంబంధించిన నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ పర్యవేక్షణలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 84 నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు, 4 ఖాళీ సర్టిఫికేట్లు, జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లు 14, ఎ4 సైజ్ పేపర్లు 40, ఒక సీపీయు, ఒక మానిటర్, ఒక ప్రింటర్, ఒక మౌస్, ఒక కీబోర్డ్, రెండు సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.