ఫేస్బుక్ పరిచయం ప్రాణం తీసింది
ఆన్లైన్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామంలో చోటుచేసుకుంది.
దిశ, వర్ధన్నపేట: ఆన్లైన్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు ,సీఐ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం బండౌతపురం గ్రామానికి చెందిన మరుపట్ల అనూక్ (24) అనే యువకుడికి వైజాగ్ కు చెందిన గురిజ నరేందర్ తో ఆన్లైన్ లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కొంత కాలంగా స్నేహం నడుస్తుంది. ఈ స్నేహం డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వరకు వెళ్ళింది. ఈ తరుణంలో నరేందర్ అనే యువకుడు మృతుడు అనూక్ కు మాయ మాటలు చెప్పిరూ. 6 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత నుండి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అనూక్ ను ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో తన బంధువులతో కలిసి నరేందర్ స్వస్థలమైన వైజాగ్ కు వెళ్లారు.
అక్కడ అతని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు ఇస్తామని నరేందర్ మేనమామ ఒప్పుకున్నారు. ఈ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్లీ వీరిద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగింది. ఈ తరుణంలో నరేందర్ మిగతా రెండు లక్షలు రూ. 90,000 ఇస్తేనే మిగతా రెండు లక్షలు ఇస్తానని చెప్పడంతో ఈ నెల 13వ తేదీన ఫోన్ పే ద్వారా పంపించారు. ఆ మరుసటి నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్థాపానికి గురైన అనూక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు బైక్ పై వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ అనూక్ తుదిశ్వాస విడిచారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.