Drug Injections: డ్రగ్ ఇంజెక్షన్స్ అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు.. తొమ్మిది మంది అరెస్ట్
రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు(Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో డ్రగ్ ఇంజెక్షన్స్ (Drug Injections) అమ్ముతున్న ముఠా గుట్టును టీజీ న్యాబ్ (TG NAB) పోలీసులు రట్టు చేశారు. హజీపూర్ (Hajipur) కేంద్రంగా మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సరస్వతి ఎంటర్‌ప్రైజెస్ (Saraswathi Enterprises) పేరుతో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో రూ.88 లక్షల విలువ చేసే మత్తు ఇంజక్షన్లను ముఠా విక్రయించినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ గుప్తా (Vijay Kumar Guptha)తో పాటు విక్రయదారుడు నయీముద్దీన్‌ను (Nayeemuddin) పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి ఇంజెక్షన్లు కొని స్థానికంగా అమ్ముతున్న మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.