ఉద్యోగాల పేరుతో రూ.16 లక్షల దోపిడీ.. దంపతుల ఆత్మహత్య

ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలకడంతో కడుపు కట్టుకుని కూడబెట్టిన డబ్బంతా ఓ కేటుగాడికి ఇచ్చారా దంపతులు.

Update: 2024-10-01 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనం ఒకటి తలిస్తే.. విధి ఇంకోటి తలుస్తుందంటారు పెద్దలు. సరిగ్గా అదే జరిగింది ఓ యువజంట విషయంలో. ఉద్యోగాల కోసం ఓ వ్యక్తికి లక్షల రూపాయలు ఇవ్వగా.. అనుకోకుండా ఆ వ్యక్తి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో అటు ఉద్యోగాలు రాక.. ఇటు అప్పుల వాళ్ల ఒత్తిడి భరించలేక చివరికి ప్రాణాలు తీసుకోవడమే మేలని అనుకుందా యువజంట. దీంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిరాం తండాకు చెందిన హాలావత్ రత్న కుమార్, పార్వతి కొత్తగూడెంలోని ఓ వస్త్రాల దుకాణంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నెల నెలా కొంచెం డబ్బు కూడబెట్టుకున్నారు.

అదే టైంలో కరీంనగర్‌కి చెందిన ఓ వ్యక్తి సింగరేణిలో ఉద్యోగాలను ఇప్పిస్తానని చెప్పడంతో దాచుకున్న డబ్బుతో పాటు అప్పు చేసి మరీ అతడికి రూ.16 లక్షలు చెల్లించారు. అయితే హఠాత్తుగా డబ్బు తీసుకున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో కట్టిన లక్షల డబ్బు పోవడంతో పాటు.. ఉద్యోగాలు రాకపోవడంతో అప్పులు తిరిగి చెల్లించలేకపోయారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక దంపతులిద్దరూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. 3 రోజుల క్రితం వీరిద్దరూ పురుగుల మందు తాగడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Similar News