దేవుణ్ణి కూడా వదలని దొంగలు..
మండల కేంద్రం చిలుకూరులోని బస్టాండ్ సెంటర్లో ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయంలోని హుండీ చోరీకి గురైంది.
దిశ, చిలుకూరు : మండల కేంద్రం చిలుకూరులోని బస్టాండ్ సెంటర్లో ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయంలోని హుండీ చోరీకి గురైంది. ఆలయ కమిటీ బాధ్యులు గరిణె శేషగిరిరావు, యడవెల్లి పుల్లారావు చెప్పిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించి హుండీని తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో కనుగొన్నారు. చోరీ చేసిన హుండీని తెరిచి నగదు అపహరించి గ్రామానికి దూరంగా ఉన్న జానకినగర్ స్టేజీ సమీప ప్రాంతంలో పారవేశారు.
ఉదయం హుండీని గమనించిన కొందరు ఆలయ కమిటీకి సమాచారం అందించారు. దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న ఈ దేవాలయాన్ని ఇటీవలే ఆధునికీకరించి ఆంజనేయస్వామి విగ్రహం, జీవ ధ్వజ స్తంభానికి పునః ప్రాణ ప్రతిష్ట చేశారు. సంబంధిత ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో వందలాది భక్తులు హుండీలో తమ కానుకలు సమర్పించుకున్నారు. సుమారుగా రూ.2 లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించామని, త్వరగా నిందితులను అరెస్టు చేసి దేవుని నగదు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆలయ బాధ్యులు కోరారు.