గర్భిణి దారుణ హత్య.. ప్రియుడే హతమార్చాడని తేల్చిన పోలీసులు
తనను పెళ్లి చేసుకుని.. తన పేరిట కొంత పొలం రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేసిన ఓ గర్భిణీని ఆమె ప్రియుడే హతమార్చిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
దిశ, జడ్చర్ల/అచ్చంపేట: తనను పెళ్లి చేసుకుని.. తన పేరిట కొంత పొలం రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేసిన ఓ గర్భిణీని ఆమె ప్రియుడే హతమార్చిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాజీపేట మండలం గొరిట గ్రామానికి చెందిన ఆరేళ్ల లక్ష్మి(35) కు 15 సంవత్సరాల క్రితం దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తల్లిగారి ఊరు అయిన గొరిటకు వచ్చిన లక్ష్మి తల్లితో కలిసి నివాసం ఉంటుంది. అదే గ్రామానికి చెందిన చెన్నయ్య అనే ట్రాక్టర్ డ్రైవర్ తో ఏర్పడిన పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
అప్పటికే చెన్నయ్యకు వివాహమై ఉండడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. గ్రామస్తులు పంచాయతీ నిర్వహించి లక్ష్మికి లక్ష రూపాయల పరిహారం ఇప్పించి ఇరువురు ఇక నుంచి సంబంధం కొనసాగించరాదని తీర్పు చెప్పారు. దీంతో లక్ష్మి గత కొంతకాలంగా జడ్చర్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటుంది. చెన్నయ్య భార్య గర్భం దాల్చడంతో తన దృష్టిని మళ్లీ ప్రియురాలు వైపు మళ్ళించాడు. ఈ సమయంలో అతని ప్రియురాలు కూడా గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకొని.. తన పేరిట రెండు ఎకరాల పొలం రిజిస్ట్రేషన్ చేయించాలని చెన్నయ్యను డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అటు భార్య, ఇటు ప్రియురాలు మధ్య ఇబ్బందులు పడుతూ వచ్చిన చెన్నయ్య ఎలాగైనా తన ప్రియురాలిని హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చాడు.
ఫిబ్రవరి 28వ తేదీన శ్రీశైలం వెళ్లి పెళ్లి చేసుకుందాం అని లక్ష్మీనీ నమ్మించి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి పాలెం దేవాలయంలో ఉండి మార్చి 1వ తేదీన తన మోటార్ సైకిల్ పై అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెను కర్రలతో కొట్టి గొంతు నులిమి చంపేశాడు. తన మోటార్ సైకిల్ లో ఉన్న పెట్రోల్ తీసి ఆమెపై పోసి తగులబెట్టి జారుకున్నాడు. ఈ విషయమై మృతురాలి తల్లి చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి విచారణ జరిపారు. నిందితుడు చెన్నయ్య తన నేరాన్ని అంగీకరించి లక్ష్మిని హత్య చేసిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు.
కాల్చేసి ఉన్న అస్తిపంజరాలను గుర్తించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా నిందితుడు గతంలోనూ ఐదు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించినట్లుగా సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎస్ఐలు ఖాదర్, లెనిన్, సిబ్బంది వెంకటేశ్వర్లు, విష్ణు, వాసురాం తదితరులను సీఐ రమేష్ బాబు అభినందించారు.