ఫోన్ టాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రెండు వర్గాలుగా చీలిపోయిన పోలీసులు!

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది.

Update: 2024-10-18 06:59 GMT

దిశ, సిటీక్రైం: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. కొత్త ప్రభుత్వం ఈ నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తామని హెచ్చరించినా.. ఆ కేసులో మాత్రం ముందడుగు పడటం లేదు. ఆ ఫైలుకు బూజు పట్టిందని పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు దర్యాప్తులో రోజుకో కొత్త అంశంతో హల్ చల్ చేసిన పోలీసులు.. ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లు, అరెస్టైన పోలీసు అధికారుల వాంగ్మూలాలతో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అరెస్టు ఖాయమని సంకేతాలు ఇచ్చినా ఆ దర్యాప్తులోని అంశాలన్నీ ఇప్పుడు తుస్సుమన్నాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇదంతా కేవలం ఆఫీసర్స్ రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగారుస్తున్నారని పోలీసు వర్గాల్లోని కొందరు బడా ఆఫీసర్లు చెవులు కొరుక్కొంటున్నారు. కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలోని పెద్దలతో పాటు ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితుడు ప్రభాకర్ రావుకు దర్యాప్తుకు సంబంధించి ప్రతి కదలికను చేరవేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇలా దర్యాప్తు అధికారుల మూవ్ మెంట్ తెలుసుకుని ప్రభాకర్ రావు పోలీసు అరెస్టు నుంచి తప్పించుకుంటూ టైంపాస్ చేస్తున్నాడని పోలీసు వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్సీ అరెస్టుకు అంతా సిద్ధం.. కానీ..

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు పూర్తి ఆధారాలు సేకరించి.. ఓ ఎమ్మెల్సీ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అతనికి లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఇక అరెస్టుకు రెడీ అవుతున్న సందర్భంలో ఓ కీలక ఐపీఎస్ అధికారి పావులు కదపడంతో అరెస్టుకు బ్రేక్ పడింది. అంతే కాకుండా హైదరాబాద్ యూనిట్‌లో కీలకాధికారిగా ఉన్న ఆఫీసర్‌ను ఏకంగా బదిలీ చేయించేశారని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీని కోసం కొంత మంది ఉన్నతాధికారులు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు తెలిసింది. ఫోన్ టాపింగ్ కేసును అటకెక్కించేందుకు ఓ వర్గం పోలీసు అధికారులు ఏకంగా ప్రభుత్వ పెద్దలను భయాందోళనకు గురిచేసి కలవరానికి గురి చేశారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఫోన్ టాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారినే బదిలీ చేసేందుకు స్కెచ్ వేశారని పోలీసు వర్గాల్లో మరో చర్చ మొదలైంది. ప్రభుత్వం కూడా ఓ వర్గం ఆఫీసర్‌ల మాటలు విని తాత్కాలికంగా ఈ దర్యాప్తును ఆపేసిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే సదరు ఎమ్మెల్సీ సురక్షితంగా బయటపడ్డాడనే అభిప్రాయం ఇప్పుడు పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసులు అరెస్టు కాగా.. మరికొందరు నోటీసులు అందుకున్నారు.

ప్రభాకర్ రావు అరెస్టు సంగతేంటి?

ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అరెస్టుకు అవకాశం ఉన్నా దర్యాప్తును సైలెంట్ కావడంతో కేసు నీరుగారిపోయింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేసిన ఉన్నతాధికారి ఢిల్లీలో సీబీఐ, ఆ తర్వాత ఇంటర్ పోల్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభాకర్ రావు అరెస్టుకు మొత్తం ప్రణాళిక రూపొందించుకున్నారు. ప్రభాకర్ రావుకు అమెరికాకు సంబంధించిన వీసాలోని షరతుల కారణంగా ఆరు నెలల తర్వాత అతను ఒకసారి ఆ దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాల్సిన అవరసం ఉంది. ఆ సమయంలో అతను విమానాశ్రయం రాక తప్పదు, ఆ సమయంలో రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయించి అరెస్టుకు పక్కా స్కెచ్ వేసుకోగా ఓ వర్గం పోలీసు అధికారుల గందరగోళ వ్యవహారంతో దర్యాప్తుకు ఆటంకం కలగడంతో ప్రభాకర్ రావు అరెస్టు ఛాన్స్ మిస్సయ్యిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ ఫోన్ టాపింగ్ కేసుతో సీనియర్ పోలీసు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైందని అది ఎక్కడికి దారి తీస్తోందో అని పోలీసు వర్గాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా రిటైర్ అయినా తర్వాత ఈ ఫోన్ టాపింగ్ కేసు డెడ్ అంశాలపై అధికారులు గళంవిప్పే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి.


Similar News