రైతు ఖాతా నుంచి రూ.50 వేలు కాజేసిన బ్యాంకు సిబ్బంది
బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఆ బ్యాంక్ అధికారులే కాజేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బేలా మండలంలో చోటు చేసుకుంది.
దిశ, ఆదిలాబాద్ : బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఆ బ్యాంక్ అధికారులే కాజేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బేలా మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని మనియార్ పూర్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం రాందాస్ ఈ ఏడాది ఆగస్టు నెల 28వ తేదీన బేలా మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ.50 వేలు డ్రా చేసేందుకు విత్ డ్రా ఫాం రాసి ఇచ్చాడు. దాంతో రూ.20వేలు మాత్రమే ఇస్తామని మరో విత్ డ్రా ఫాం రాయమని బ్యాంక్ సిబ్బంది సూచించారు. దాంతో రూ.20 వేలకు ఫాం రాసి ఇచ్చాడు. కానీ ముందుగా 50 వేల కోసం రాసి ఇచ్చిన మరో విత్ డ్రా ఫాం తిరిగి ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకున్నారు. ఇటీవల మళ్లీ రూ. 50 వేల కోసం బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని సదరు అకౌంటెంట్ రైతుకు తెలియజేశాడు.
దీంతో తన ఖాతాలో డబ్బులు ఏమయ్యాయని ఆరా తీస్తే ఆగస్టు 28న తాను ముందుగా రాసిచ్చిన రూ.50 వేల రసీదు పై అదే రోజు డబ్బులు డ్రా చేసినట్లు స్టేట్మెంట్లో చూపించింది. దీనిపై బ్యాంక్ అధికారులను అడగగా తమకేమీ తెలియదని సమాధానం దాటవేశారు. బ్యాంక్ అధికారులే తనకు అన్యాయం చేశారని శుక్రవారం బేలా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రైతు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి స్టేట్ మెంట్ లో ఒకే రోజు 50 వేలు, 20 వేల చొప్పున డ్రా అయినట్లు ఉందని అన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేసి బ్యాంక్ అధికారుల నుంచి తిరిగి ఖాతాదానికి డబ్బులు ఇప్పించాలని ఆయన కోరారు.